144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో భాగంగా సుమారు కోటిమంది భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ వద్ద త్రివేణీ సంగమంలో ఆదివారం మొదటి షాహీ స్నాన్, పుష్య పూర్ణిమ పవిత్ర స్నానం ఆచరించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంగమస్నానం ఆచరించిన భక్తులపై పుష్పవృష్టి కురిపించింది. ప్రయాగరాజ్‌లోని అన్ని ఘాట్లలోనూ, అన్ని అఖాడాల దగ్గరా స్నానాలు చేసిన భక్తుల మీద హెలికాప్టర్ ద్వారా పూలవాన కురిపించారు.
గగనతలం నుంచి గులాబి రేకలు వర్షధారల్లా జాలువారుతుంటే భక్తులు ఆనందాశ్చర్యాల్లో మునిగితేలారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ విభాగం పుష్పవర్షానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళాలో ప్రధానమైన నాలుగు షాహీస్నాన్ రోజుల్లో త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించే భక్తులపై గులాబి పూలరెక్కలను వర్షంగా కురిపించడానికి అన్ని ఏర్పాట్లూ చేసింది.
ప్రతీ పవిత్ర స్నానం రోజునా 20 క్వింటాళ్ళ పూలను వర్షంగా కురిపించాలని ప్రణాళిక రచించారు. అందులో భాగంగా, కుంభమేళా మొదటి రోజు అయిన పుష్య పూర్ణిమ నాడు మొదటి పవిత్ర స్నానం ఆచరించిన భక్తుల మీద గులాబి రేకుల వాన కురిపించారు. ఊహించని ఆ పుష్పవృష్టితో భక్తులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. భక్తిపారవశ్యంతో జై శ్రీరామ్ నినాదాలు చేసారు.
ఒక వైపు హెలికాప్టర్లతో పూలు కురుస్తుండగా, మరోవైపు యూపీ సర్కారు పటిష్ట భద్రతా యేర్పాట్లు చేసింది. కుంభమేళాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భక్తులందరూ సురక్షితంగా ఉండేందుకు భద్రతా బలగాలను మోహరించింది. స్నానఘట్టాలు, అఖాడాలు సహా ప్రయాగరాజ్ అంతటా పోలీసులు, భద్రతా బలగాలు డేగకన్నులతో కాపలా కాస్తున్నాయి.