త్రివేణి సంగమం జనసంద్రంలా మారింది. పుష్య పౌర్ణమి పురస్కరించుకుని మొదలైన 45 రోజుల మహాకుంభ మేళాలో ఇప్పటి వరకు 2 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. గంగ, యమున, అంతర్వాహిని సరస్వతి నదులు సంగమ ప్రదేశం ప్రయాగ్‌రాజ్ భక్తులతో నిండిపోయింది.
మహాకుంభ మేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఇందుకు యూపీ ప్రభుత్వం రూ.7 వేల కోట్లతో ఏర్పాట్లు చేసింది. పది వేల ఎకరాల్లో కుంభ్ నగర్ ఏర్పాటు చేసింది. భక్తుల కోసం లక్షన్నర టాయిలెట్లు ఏర్పాటు చేశారు. 3 వేల సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు. నీటి అడుగున నిఘా వేసే 200 డ్రోన్లను రంగంలోకి దించారు. 50 వేల మంది పోలీసు బలగాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు.
లక్షన్నర మంది రాత్రి బస చేసేందుకు 30 వేల తాత్కాలిక టెంట్ల నివాసాలను ఏర్పాటు చేశారు. నీటిపై తేలియాడే పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు. ఇక ప్రయాగ్‌రాజ్ ప్రాంతాన్ని హెలికాఫ్టర్ ద్వారా తిలకించే వారికి కేవలం రూ.1300కే అవకాశం కల్పించారు. దాదాపు 400 మంది విదేశీ మీడియా ప్రతినిధులు, 3 వేల మంది దేశీయ మీడియా విలేకరులు కవరేజీ చేస్తున్నారు. 14 లక్షల మంది విదేశీ భక్తులు వస్తారని అంచనా.
త్రివేణి సంగమం వద్ద ఒకేసారి 60 లక్షల మంది భక్తులు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పది వేల ఎకరాల్లో టెంట్లు, పార్కింగ్ సదుపాయం కల్పించారు. నది నీటిలో ప్రజలు మునిగిపోకుండా కేవలం 2 అడుగుల మేర నీరు ఉండేలా చర్యలు చేపట్టారు. దాదాపు 6 వేల బోట్లతో భక్తులకు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు.
మహాకుంభ మేళా భూమిపై జరుగుతోన్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా అంతర్జాతీయ మీడియా అభివర్ణిస్తోంది. 45 రోజులపాటు సాగే మహా కుంభమేళా 144 సంవత్సరాలకు వచ్చే ప్రత్యేక వేడుక కావడంతో 40 కోట్లకుపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా. 45 రోజుల్లో రూ.2 లక్షల కోట్ల వ్యాపారం జరగనుందని అధికారులు చెబుతున్నారు.