తిరుమల పరకామణిలో బంగారం దోపడీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. తీగ లాగితే డొంక కదిలిన చందాన… గతంలోనూ అనేకసార్లు పెంచలయ్య బంగారం కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.
తిరుమల శ్రీవారి బంగారం, విలువైన ఆభరణాలు ఉంచే పరకామణిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య 100 గ్రాముల బంగారాన్ని తీసుకెళుతుండగా నిఘా వర్గాలు పసిగట్టాయి. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయడంతో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. తాజాగా దొంగిలించిన 100 గ్రాముల బంగారంతోపాటు, పెంచలయ్య నివాసం నుంచి 550 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.40 లక్షలుపైగా ఉంటుందని అంచనా.
పరకామణిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తోన్న పెంచలయ్య తీరుపై నిఘా వేయగా విషయం వెలుగులోకి వచ్చింది. రెండేళ్లుగా పెంచలయ్య బంగారం దొంగిలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చెత్త తీసుకెళ్లే ట్రాలీ పైపులో విలువైన ఆభరణాలు, వజ్రాలు, బంగారు బిస్కెట్లు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. లోతుగా విచారణ జరుపుతున్నారు.