ఉత్తరప్రదేశ్‌లో కాశీ విశ్వనాథ ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలో మాంసం విక్రయిస్తున్న 15మంది దుకాణదారులపై వారణాసి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఆ ప్రాంతంలో మాంసాహారం విక్రయించడం నిషేధమంటూ సదరు దుకాణదారులకు గతంలో నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్పారు. మార్గదర్శకాలను ఉల్లంఘించినందునే ఆ దుకాణదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.
విశ్వనాథ మందిరం దగ్గర మాంసం విక్రయిస్తున్న కేసులో నిందితులు ఆలం ఖురేషీ, అమీన్, భూలేటాన్, తన్వీర్, నవెయిద్, షమీమ్ ఖురేషీ, మొహమ్మద్ షరీఫ్, మొహమ్మద్ నియాజ్, బచ్చా ఖురేషీ, రియాజ్. వారిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223, 325 ప్రకారం కేసు నమోదు చేసారు.
వారణాసి మునిసిపల్ వెటరినరీ అధికారి తొలుత దుకాణదారులకు మాంసం అమ్మకూడదంటూ నోటీసులు జారీ చేసారు. రెండు రోజుల వ్యవధి ఇచ్చారు. వారిలో ఇద్దరు వ్యక్తులకు అసలు మాసం అమ్మేందుకు కావలసిన లైసెన్సులు లేనేలేవు. అయినా వారు గుడికి కేవలం 200 మీటర్ల పరిధిలోపలే మాంసం విక్రయిస్తున్నారు.
విశ్వనాథ ఆలయం చుట్టూ 2కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాలను నిషేధిస్తూ గతేడాది స్థానిక ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆ పరిధిలో ఉన్న మాంసం దుకాణాలకు నోటీసులు కూడా ఇచ్చింది. 2024 పిబ్రవరి 17న మొదటి నోటీసు, 2025 జనవరి 2న రెండో నోటీసు, 2025 జనవరి 4న మూడో నోటీసు పంపించారు. అయినా నిందితులు మాంసం విక్రయాలు ఆపలేదు.