భారతీయ ధర్మం, సంస్కృతి, సేవాభావం, మానవ విలువలకు అంతర్జాతీయ వ్యాప్తిని కలిగిస్తున్న సంస్థలలో ప్రధానమైనది ‘బిఎపిఎస్ – బొచాసన్‌వాసీ శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్’ సంస్థ అని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రశంసించారు. ఆదివారం ఆయన ఇంగ్లండ్ రాజధాని లండన్‌లోని నియాస్‌డెన్ ప్రాంతంలో ఉన్న స్వామి నారాయణ్ మందిరాన్ని దర్శించుకున్నారు.
ఆ విషయం గురించి స్పీకర్ ఓం బిర్లా ‘ఎక్స్’లో ఒక ట్వీట్ పోస్ట్ చేసారు. ‘లండన్‌లోని శ్రీ స్వామినారాయణ మందిరాన్ని దర్శించుకోవడం గొప్ప అనుభవం, అది భారత సంస్కృతి ప్రత్యేక సంపద’’ అన్నారు. అది కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు… భారతీయ ధర్మానికి, సంస్కృతికి, సేవాభావానికి, మానవ విలువలకూ అంతర్జాతీయ వేదికగా నిలిచింది. బీఏపీఎస్ కృషి యావత్ ప్రపంచం మీద భారత్ ఆధిక్యం, ప్రభావం ఎలాంటివో తెలియచెప్పింది’’ అని రాసుకొచ్చారు.
స్పీకర్ ఓం బిర్లాకు ఆలయం వివరాలను స్థానిక నిర్వాహకులు వివరించారు. బిర్లా అక్కడ విధ్యుక్తంగా పూజలు చేసారు. తర్వాత యూకే, ఐరోపాల్లో బీఏపీఎస్ కార్యకలాపాల గురించి తెలుసుకున్నారు. స్థానికంగా నియాస్‌డెన్ మందిరంగా పేరున్న స్వామి నారాయణ్ మందిరం ఐరోపాలో, ఇంగ్లండ్‌లో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆ సంస్థ తదుపరి దేవాలయం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో నిర్మించనున్నారు.