మహాకుంభమేళా ఘనత, ఆధ్యాత్మికత ప్రపంచ పర్యాటకుల దృష్టిని సైతం ఆకర్షిస్తున్నాయి. గంగానదికి 12ఏళ్ళకు ఒకసారి జరిగే కుంభమేళాలో పాల్గొనడానికి విదేశీయులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. కుంభమేళాను కేవలం వినోదంగా పరిగణించకుండా, దానిలోని ఆధ్యాత్మిక వైభవాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అలా, కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన వారిలో టర్కీకి పినార్ ఒకరు. ఆమె మొదటిసారి భారత్ వచ్చారు, ఇక్కడి ఘనమైన సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటున్నారు.
పినార్ ఈ ఉదయం గంగానదిలో పవిత్ర స్నానం చేసారు. నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకున్నారు. మన దేశానికి చెందిన సనాతన ధర్మంలోని ఆధ్యాత్మిక ఆంతరిక ప్రయాణంలోకి సంలీనమయ్యారు. ఆ అనుభవం గురించి పినార్ వివరించారు.
పినార్ మనదేశంలో జరిగే మహాకుంభమేళా గురించి చాలాకాలం క్రితం తన మిత్రల దగ్గర మొదటిసారి విన్నారు. అప్పటినుంచీ ఆమె ఈ మహోత్సవాన్ని కన్నులారా చూడాలని కలలుగన్నారు. ఇన్నాళ్ళకు ఆ కల సాకారమైందని ఆమె ఆనందిస్తున్నారు.
భారతీయ సంస్కృతి పినార్‌ను మంత్రముగ్ధురాలిని చేసింది. మహాకుంభమేళాలో పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. త్రివేణీసంగమం దగ్గర ఇసుకజాలుల్లో నడవడం, గంగలో పవిత్ర స్నానం చేయడం తన జీవితంలో మరువలేని మధురస్మృతులుగా మిగిలిపోతాయని ఆమె అన్నారు.
మహాకుంభమేళాను మొదటిసారి సందర్శించుకున్న పినార్, ఓ గొప్ప ఆధ్యాత్మిక ఆంతరిక యాత్రను పూర్తిచేసారు. కుంభమేళా వాతావరణాన్ని, అక్కడి సానుకూల శక్తినీ సక్రమంగా గ్రహించి అర్ధం చేసుకున్నారు. భారతదేశపు సంప్రదాయాల గూఢతను సక్రమంగా అర్ధం చేసుకోవడం గొప్ప అనుభూతిగా నిలిచిందన్నారు. గంగాస్నానం, ధ్యానం, తిలకధారణ వంటి చర్యలు భారతీయమైన సనాతనధర్మం పట్ల ఆమెకున్న గౌరవానికి నిదర్శనంగా నిలిచాయి.