తెలుగువారికి పెద్దపండుగ సంక్రాంతి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న తెలుగువారయినా, సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. మౌలికంగా వ్యవసాయ ప్రధానమైన ఈ పండుగ శోభ పల్లెసీమల్లో అందంగా కనిపిస్తుంది. అందులోనూ గోదావరీ పరీవాహక ప్రాంతంలోని కోనసీమలో సంక్రాంతి అందాలు చూడడానికి రెండు కళ్ళూ చాలవు.
కోనసీమలో సంక్రాంతి పండుగ సమయంలో ప్రభల తీర్థం జరుపుతారు. అంబాజీపేట మండలం జగ్గన్నతోటలో కనుమ పండుగ రోజు జరిగే ప్రభల తీర్థం చూడడానికి ఎక్కడెక్కడినుంచో ప్రజలు వెల్లువెత్తుతారు. కోనసీమలోని పదకొండు గ్రామాలకు చెందిన రుద్రులు జగ్గన్నపేట చేరువలోని కొబ్బరితోటలో సమావేశమయ్యారని ప్రతీతి. దానికి ప్రతీకగా ప్రభల తీర్థం నిర్వహిస్తారు. సుమారు 400 సంవత్సరాలుగా ఈ వేడుక జరుగుతోంది.
జగ్గన్నతోట రుద్రప్రభల తీర్థానికి ఈ యేడాది అరుదైన గుర్తింపు లభించింది. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘ఉత్సవ్’ విభాగంలో ఈవెంట్ అండ్ ఫెస్టివల్స్ జాబితాలో స్థానం దక్కింది. గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ ఏకాదశ రుద్రప్రభల తీర్థం విశిష్టతపై ప్రధాని మోదీ, సాంస్కృతికశాఖల మంత్రి గజేంద్రసింగ్ షెకావత్లకు ఇటీవల లేఖ రాసారు. దాన్ని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రభల ఉత్సవాన్ని గొప్ప పర్వదినంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది.