సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. భారత్ టిబెట్ సరిహద్దు లడ్డాఖ్ ప్రాంతంలో లక్షలాది సైన్యంలో చైనా సైనిక విన్యాసాలు చేపట్టింది. క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో యుద్ధ సామాగ్రిని వేగంగా చేర్చడంతోపాటు, సైనికులు వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా తీర్చిదిద్దేందుకు చైనా సైన్యం విన్యాసాలు చేపట్టింది. అత్యాధునిక పరికరాలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. కొత్తగా నిర్మించిన రహదారులపై యుద్ధ సామాగ్రిని సరిహద్దులకు చేర్చి విన్యాసాలు నిర్వహిస్తోంది. దీంతో భారత సరిహద్దు దళాలు అప్రమత్తం అయ్యాయి.
ఇండియన్ ఆర్మీ ఫౌండేషన్ డే కొద్ది రోజుల్లో ఉండగా పీఎల్ఏ ఈ విన్యాసాలు నిర్వహిస్తోంది. షి జియాంగ్ మిలటరీ కమాండ్ ఈ సైనిక విన్యాసాలు చేపట్టింది. దాదాపు 50 వేల సైన్యం పాల్గొంటున్నట్లు సమాచారం అందుతోంది. 2020లో గల్వాన్ సరిహద్దు వద్ద భారత సైనికులపై దాడి తరవాత ఇరు దేశాలు సంయమనం పాటించాలని నిర్ణయించారు. ఆ తరవాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గాయి. ఆ ప్రాంతంలో చైనా సైన్యం కొంత వెనక్కు వెళ్లింది. తాజా సైనిక విన్యాసాలతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది.
క్లిష్టవాతావరణ పరిస్థితుల్లో భారత సైన్యం ఏటా హిమ్ విజయ్ డ్రిల్ పేరుతో విన్యాసాలు నిర్వహిస్తుంది. గడ్డకట్టే చలి ప్రాంతాల్లో సైనికులను సన్నద్ధం చేయడం, పర్వత ప్రాంతాల్లో యుద్ధసామాగ్రిని చేర్చడం, వేగంగా సరిహద్దులను చేరుకోవడం అనే అంశాలతోపాటు అత్యాధునిక యుద్ధ పరికరాల వినియోగంపై కూడా విన్యాసాల్లో సైన్యం పరీక్షిస్తోంది.