రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హిందువులు భోగిపండుగను వైభవంగా జరుపుకున్నారు. చిరు చీకట్లు, చలిగాలుల నడుమ తెల్లవారుజామునే భోగి మంటలు వేసారు. ఇళ్ళముందు పండుగ ప్రత్యేక రంగవల్లులు తీర్చిదిద్దారు.
భోగి పండుగ, పౌష్య పూర్ణిమ కలిసి రావడంతో పండుగ సందడిగా మారింది. భక్తులు వేకువజామునే నదీస్నానాలు చేసి దేవాలయాలను సందర్శించుకుని తమ ఇష్ట దైవాలను ఆరాధించుకున్నారు. ప్రత్యక్ష నారాయణుడిగా పేరు గడించిన సూర్య భగవానుడికి సంబంధించిన పండుగ కావడంతో సూర్యుడికి పూజలు చేసారు.
సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో పెద్దపండుగ కావడంతో ఉభయ రాష్ట్రాల్లోనూ నగరాల నుంచి సొంతూళ్ళకు ప్రజలు ప్రయాణమై వెళ్ళారు. దాంతో పెద్దపెద్ద పట్టణాలు ప్రశాంతంగా మారగా, గ్రామసీమల్లో సందడి చిందులేస్తోంది. హరిదాసులు కీర్తనలు, డూడూబసవన్నల విన్యాసాలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. భోగి మంటలతో ప్రజల సమస్యలు తీరిపోయి భోగభాగ్యాలు కలగాలంటూ ఆశిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేసారు. తన స్వగ్రామం నారావారిపల్లెలో జరిగిన వేడుకల్లో చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. గ్రామంలో ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేసారు. పోటీలో పాల్గొన్న అందరికీ చంద్రబాబు భార్య భువనేశ్వరి రూ.10,116 ప్రోత్సాహకం ప్రకటించడం విశేషం.
ధర్మవరంలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంక్రాంతి వేడుకలు ప్రారంభించారు. సంప్రదాయబద్ధంగా పంచె కట్టుకుని ఎడ్లబండి మీద ఎక్కి క్రీడామైదానంలో ప్రవేశించారు. భోగిమంటలు, బసవన్నల ప్రదర్శనలు, మహిళల పాటలు ప్రేక్షకులను అలరించాయి.