హిందువుల పవిత్ర వేడుక మహాకుంభమేళా మొదలైంది. సోమవారం పుష్యపౌర్ణమి నాడు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ పవిత్ర సంగమంలో మహా కుంభమేళా వైభవంగా మొదలైంది. ఉదయం 7 గంటల 30 నిమిషాల సమయానికే 35 లక్షల మంది పవిత్ర స్నానాలు చేశారు. నేటి నుంచి మొదలైన మహాకుంభ మేళా 45 రోజుల పాటు జరగనుంది. దేశ విదేశాల నుంచి 45 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలకు తరలి వస్తారని అంచనా. ప్రతి రోజూ కోటి మంది భక్తులు స్నానాలు చేసేందుకు యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ప్రయాగ్రాజ్లోని గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద మొదలైన కుంభమేళాకు యోగీ ప్రభుత్వం రూ.5 వేల కోట్ల ఖర్చుతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. పది వేల ఎకరాల విస్తీర్ణంలో స్నానాలు చేసే ఏర్పాట్లు చేసింది. నదిలో కేవలం 2 అడుగుల మేర మాత్రమే నీరు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 50 వేల మంది పోలీసులను మోహరించారు. 3 వేల సీసీ కెమెరాలు 300 డ్రోన్లు భద్రత పర్యవేక్షణలో ఉపయోగిస్తున్నారు. నీటిపై తేలియాడే పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని భాషల్లో భక్తులకు సమాచారం అందించేందుకు పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి కలగలిపే పవిత్ర సంగమం వద్ద కోట్లాది మంది తమ విశ్వాసాలకు విలువనిస్తూ పవిత్ర స్నానాలు చేయడం హిందూమతం ఐక్యతను చాటుతోందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. పలువురు ప్రముఖులు పవిత్ర స్నానాలు ఆచరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 4500 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. సీఎం యోగీ ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు. భూమిపై జరిగే అతిపెద్ద పవిత్ర మేళా ఇదేనని అంతర్జాతీయ మీడియా కొనియాడుతోంది. విదేశాలకు చెందిన 300 మంది మీడియా ప్రతినిధులు కూడా కుంభమేళా కవరేజీకి వచ్చారు. దేశంలోని 800 మీడియా సంస్థల నుంచి ప్రతినిధులు ప్రతిక్షణం కుంభమేళా వివరాలను ప్రజలకు అందిస్తున్నాయి.