షేక్ హసీనా ప్రధాని పదవి కోల్పోయిన తరవాత బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్థాన్‌కు దగ్గరవుతోంది. షేక్ హసీనా పదవి కోల్పోయిన తరవాత భారత్ ఆమెకు ఆశ్రయం కల్పించింది. దీంతో బంగ్లాదేశ్‌లో యూనస్ నేతృత్వంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్‌తో వాణిజ్య, పౌర సంబంధాలను పెంపొందించుకుంటోంది. తాజాగా పాకిస్థాన్ పౌరుల వీసాల జారీని బంగ్లాదేశ్ మరింత సులభతరం చేసింది. పశ్చిమాసియాలో వాణిజ్యం పెంపొందించుకునేందుకు పాకిస్థాన్‌తో సంబంధాలను పునరుద్దరిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది.
18 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్, పాకిస్థాన్‌తో కీలక వాణిజ్య భాగస్వామిగా ఉంది. తాజాగా పాక్ నుంచి నేరుగా వాణిజ్య నౌక ఒకటి బంగ్లాదేశ్ చేరింది. ఎలాంటి తనిఖీలు లేకుండానే బంగ్లాదేశ్ సరకులు దిగుమతి చేసుకుంది. ఇక నుంచి పాక్ నుంచి వాణిజ్య నౌకల్లో వచ్చే వస్తువులను కూడా పరీక్షించకుండానే దిగుమతి చేసుకునేందుకు బంగ్లాదేశ్ సిద్దమైంది.
బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం కూలిపోయిన తరవాత స్థానిక మైనార్టీ హిందువులు, దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయి. ఆరు మాసాల్లో 760 దాడులు జరిగాయి. హిందువుల వ్యాపారాలపై దాడులు పెరిగిపోతున్నాయి. అయినా యూనస్ నేతృత్వంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. హరేకృష్ణ సమాజానికి చెందిన చిన్మయ్‌పై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు. కనీసం చిన్మయ్ తరపున వాదించేందుకు న్యాయవాదులను కూడా కోర్టులోకి అనుమతించకపోవడంతో భారత్, బంగ్లా సంబంధాలు మరింత క్షీణించాయి.