స్వామి వివేకానంద. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అద్భుతమైన కానుక. ఆయన నిర్భీకుడైన హేతువాది, తన అభిప్రాయాల గురించి ఎవరు ఏమంటారో అనే భయం లేకుండా నిష్కర్షగా తాను తెలుసుకున్న సత్యాన్ని ప్రకటించాడు. తన ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస దగ్గర ఆయన ప్రపంచంలోని వేర్వేరు మతాల గురించి అధ్యయనం చేసాడు. అన్ని మతాలూ తమతమ మార్గాల్లో తమ దైవాలను చేరుకోడానికి ఉద్దేశించినవే అయినా సామాజిక వ్యవస్థలో వాటి పనితీరు వేరుగా ఉంటుంది. మహమ్మదీయ, క్రైస్తవ మతాలు ప్రపంచ సామరస్యానికి హానికరంగా ఉన్నాయని స్వామి వివేకానంద తేల్చిచెప్పాడు.
ఇస్లాం, దాని ప్రవక్త మహమ్మద్, ఆ మతాన్ని ఆచరించేవారి గురించి స్వామి వివేకానంద ‘‘మహమ్మద్ శిక్షితుడైన యోగి కాదు. తాను చేస్తున్న పనులకు కారణమేంటో అతనికి తెలియదు. ఈ ప్రపంచానికి ఆయన చేసిన మంచి ఏముంది? కానీ తన మతోన్మాదంతో మహమ్మద్ ఈ ప్రపంచానికి చేసిన కీడు అంతాఇంతా కాదు’’ అని స్పష్టంగా చెప్పాడు.
హిందువులను మతం మార్చడానికి స్వామి వివేకానంద పూర్తి వ్యతిరేకి. ఇస్లాం లేదా క్రైస్తవం లోకి మార్చబడిన తటస్థ హిందువులు, తమ పాత మతాన్ని ద్వేషబుద్ధితో చూస్తారు. దాన్ని ప్రకృతి ఆరాధనకు చెందిన మతంగా భావిస్తారు. ముస్లిముల ఇలాంటి ప్రవర్తన మత విద్వేషాలను రెచ్చగొడుతుంది. అదే
విషయాన్ని వివేకానంద ఇలా చెప్పారు ‘‘హిందూధర్మం నుంచి బైటకు వెళ్ళి మతం మారినవారు
కేవలం మనిషిగా ఉండరు, హిందువులకు శత్రువులుగా మారతారు’’.
అమెరికాలోని కాలిఫోర్నియాలో 3 ఫిబ్రవరి 1900 నాడు ఇచ్చిన ప్రసంగంలో వివేకానంద ఇలా చెప్పారు. ‘‘ఇప్పుడు ముస్లిములు అత్యంత మొరటుగా వ్యవహరిస్తున్నారు, మతపరంగా విభేదాలు కలిగి ఉన్నారు. వాళ్ళ వాదన ఒక్కటే. దేవుడు ఒక్కడే, అతను అల్లా. అతని ప్రవక్త మహమ్మద్. దానికి మించి మాట్లాడే వాళ్ళు చెడ్డవాళ్ళు. వాళ్ళని నాశనం చేసి తీరాలి. ఇస్లాంను విశ్వసించని వారిని ఒక్క క్షణంలోనే
చంపివేయాలి. ఇస్లాం కాని ప్రతీదాన్నీ ధ్వంసం చేసేయాలి. ఇస్లాం కాకుండా వేరే దాన్ని బోధించే ప్రతీ పుస్తకాన్నీ తగులబెట్టేయాలి, పసిఫిక్ నుంచి అట్లాంటిక్ వరకూ మొత్తం ప్రపంచం అంతా ఐదువందల సంవత్సరాల పాటు రక్తమే పారింది. అదీ మహమ్మదీయ మతం అంటే.’’
1889 ఏప్రిల్‌లో ‘ప్రబుద్ధ భారత’ పత్రికలో ప్రచురితమైన ఒక ఇంటర్‌వ్యూలో వివేకానంద ఇలా చెప్పారు. ‘‘హిందూధర్మం నుంచి ఇస్లాం లేదా క్రైస్తవంలోకి మతమార్పిడి అయిన వారిలో అత్యధికులు కత్తికి లొంగిపోయిన వారు లేదా వారి వారసులే.’’
అలా అని వివేకానంద ఇస్లాంను పూర్తిగా నిందించడం లేదా శపించడమో చేయలేదు. వారి పద్ధతులను ఆయన మెచ్చుకున్న సందర్భాలూ కొన్ని ఉన్నాయి. ఇస్లాంలోని సౌభ్రాతృత్వం ఆయనను ఆకట్టుకుంది. ‘‘మహమ్మదీయులు అందరూ సమానంగా ఉండాలి, సోదరభావంతో ఉండాలి అని మహమ్మద్ తన జీవితంలో ఆచరించి చూపించాడు. అక్కడ జాతి, కులం, రంగు, లింగ ప్రసక్తి లేదు. టర్కీ సుల్తాను ఆఫ్రికా సంత నుంచి నీగ్రోను కొనుక్కోవచ్చు. అతన్ని బంధించి టర్కీ తీసుకువెళ్ళి ఉండవచ్చు. కానీ ఆ బానిస ముస్లింగా మారితే, తగిన ప్రతిభాపాటవాలు కలిగి ఉంటే, అతను సుల్తాను కూతురిని పెళ్ళి చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితి అమెరికాలో ఉందా? అమెరికాకు బానిసలుగా తీసుకెళ్ళిన నీగ్రోలకు అక్కడి అమెరికన్లను పెళ్ళి చేసుకునే పరిస్థితి ఉందా?’’ అని ప్రశ్నించాడు.
ఇంక క్రైస్తవం గురించి వివేకానంద ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం. క్రైస్తవ మిషనరీల
మతమార్పిడి కుట్రలను, హిందువుల విశ్వాసాలు, పద్ధతులపై నిరంతరాయంగా క్రైస్తవులు చేసిన దాడులను వివేకానంద నిష్కర్షగా తెగనాడాడు.
భారతదేశంలో క్రైస్తవ ప్రచారం తొలినాళ్ళలో మిషనరీలు బెంగాల్‌పై ఎక్కువ దృష్టి సారించారు. కెసి బెనర్జీ, ఎంఎల్ బాసక్, లాల్ బేహారీ, మధుసూదన్ దత్తా వంటివారు బెంగాలీ బ్రాహ్మణ కుటుంబాల్లో పుట్టి,
క్రైస్తవులుగా మారారు. బెంగాల్‌లో క్రైస్తవాన్ని వ్యాపింపజేయడానికి వారు విస్తృతంగా పనిచేసారు. రాజా రామమోహన రాయ్ బ్రహ్మసమాజం కంటె కేశవచంద్రసేన్ బ్రహ్మసమాజం వేరేగా ఉండేది. రాజా రామమోహన రాయ్ క్రైస్తవానికి వ్యతిరేకంగా పనిచేస్తే కేశవచంద్రసేన్ క్రైస్తవాన్ని నెత్తికెత్తుకున్నాడు. అలాంటి నేపథ్యంలో బెంగాల్ నుంచే వచ్చిన వివేకానంద క్రైస్తవం గురించి ఎలా ఆలోచించాడో చూద్దాం.
వివేకానందను బైబిల్ ఆకట్టుకోలేకపోయింది. కొత్త నిబంధనలో చెప్పిన విషయాలు, ప్రతిపాదించిన సిద్ధాంతాలూ క్రైస్తవం కంటె ముందే యూదుల్లో వ్యాప్తిలో ఉన్నాయి. యూదు మతగురువులైన రబ్బీలు చెప్పిన విషయాలే అవన్నీ… అని వివేకానంద స్పష్టంగా ప్రకటించాడు.
క్రీస్తు చేసాడని చెప్పే అద్భుతాలు కూడా వివేకానందను ఆకట్టుకోలేకపోయాయి. నిజానికి అవి క్రైస్తవం పట్ల ఆయన విముఖతను మరింత పెంచాయి. అద్భుతాలు చేయడం, స్వస్థత పరచడం వంటివి చేయడానికి క్రీస్తుకున్న గొప్ప శక్తులేంటి? అని వివేకానంద నేరుగానే అడిగాడు.
వివేకానంద క్రైస్తవులను తీవ్రంగానే విమర్శించాడు. క్రీస్తు ఒక్కడే రక్షకుడు అన్న వారి వాదన తప్పు అని నిష్కర్షగా చెప్పాడు. ఇంకా విచిత్రం ఏంటంటే అసలు క్రైస్తవంలో లోపించినది క్రీస్తే అని వివేకానంద వ్యాఖ్యానించాడు. ‘‘ఇన్ని రకాల చర్చిల్లో క్రీస్తుకు ప్రాతినిధ్యం వహించే చర్చి అసలుందా? చర్చి శాఖలు అన్నీ అసహనం చూపడంలో సమానమైనవే, తాము నమ్మిన పద్ధతిని నమ్మనివారిని చంపేస్తామని బెదిరించినవే. క్రైస్తవానికి క్రీస్తు బోధనల కంటె క్రీస్తు అనే వ్యక్తే ఎక్కువ ప్రధానమైపోయాడు. ఆయన ఒక్కడే దైవపుత్రుడు అయిపోయాడు. బాప్టిజం బాహ్యప్రవర్తనగానే మిగిలిపోయింది తప్ప వ్యక్తి అంతర్గతాన్ని
కనీసం తాకలేకపోయింది. మానవుల ప్రవర్తనను సంస్కరించడానికి బదులు బాప్టిజం అనే ప్రక్రియ వ్యక్తుల్లో కొన్ని నమ్మకాలను చొప్పించడాన్నే లక్ష్యంగా చేసుకుంది. బాప్టిజం తీసుకున్నవారిలో అత్యధికులు అంతకుముందు ఎలా ఉండేవారో ఆ తర్వాత కూడా అలానే ఉండిపోయారు. వారిలో ఎలాంటి పరివర్తనా లేదు. పైగా, మతగురువు ఏవో కొన్ని వాక్యాలు చదువుతూ తమ నెత్తిన కొన్ని నీళ్ళచుక్కలు చిలకరించి బాప్టిజం ఇచ్చేసారు కాబట్టి తాము మిగతావారికంటె అధికులము అనే అహంభావులుగా మారిపోయారు, అది మరింత దారుణం’’ అని వివేకానంద గమనించాడు.
ఐరోపాలో గెలీలియో వంటి శాస్త్రవేత్తలకు క్రైస్తవం ఎలాంటి గతి పట్టించిందో స్వామి వివేకానందకు స్పష్టంగా తెలుసు. ‘‘కాన్‌స్టాంటైన్ రాజు కాలం నుంచీ క్రైస్తవం కత్తితో వ్యాపించింది, సైన్సునీ తత్వశాస్త్రాన్నీ అణగదొక్కేసింది. క్రైస్తవం ఒక మూఢనమ్మకాల వ్యవస్థ, దాన్నుంచి హిందువులు నేర్చుకునేదీ, పొందగలిగేదీ ఏమీ లేదు. క్రైస్తవాన్ని అనుసరించనివాళ్ళు నరకంలో పడిపోతారు అనే మిషనరీల బెదిరింపులకు హిందువులు భయపడనక్కరలేదు. నిజానికి క్రైస్తవ మిషనరీలతో సాంగత్యం కంటె నరకమే చాలా మేలు’’ అని వివేకానంద కుండబద్దలుగొట్టాడు.
వివేకానందను మతం మార్చడానికి ఒక క్రైస్తవుడు విశ్వప్రయత్నమే చేసాడు. అతనితో వివేకానంద సంభాషణ ఇలా సాగింది.
‘‘నువ్వొక ఘోరపాపివి.’’
‘‘అవును… అయితే?’’
‘‘నీకోసం నాదగ్గర మంచి మార్గం ఉంది’’
‘‘నీ దగ్గరే ఉండనియ్యి’’
‘‘పాపివిగా ఉంటే నువ్వు నరకానికి వెడతావు’’
‘‘చాలామంచిది. ఇంకేంటి. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తావు?’’
‘‘నేను కచ్చితంగా స్వర్గానికే వెళ్తాను’’
‘‘అయితే నేను నరకానికే వెళ్తాను’’
వివేకానంద ఇచ్చిన ఆ జవాబుతో ఆ క్రైస్తవ మిషనరీ ఇంక ఆయన జోలికి రాలేదు.
క్రైస్తవులు చేసే ప్రచారాన్ని వివేకానంద తీవ్రంగా ఖండించాడు. ప్రజలు మంచివారుగా తయారవడానికి క్రీస్తు సాయపడగలడు అనుకుంటే, చాలా కాలంగా తననే ప్రార్థిస్తున్న క్రైస్తవ దేశాల్లో ఆయన ఎందుకు విఫలమయ్యాడు? అని ఆయన ప్రశ్నించాడు.
ఒక మిషనరీ వివేకానందతో ‘‘మీరంతా నాశనమైపోయారు. కానీ క్రైస్తవాన్ని నమ్ముకుంటే మీకు క్రీస్తు సాయం చేస్తాడు’’ అని చెప్పాడు. ‘‘అది ఉత్త మూఢవిశ్వాసం. సరే, వాదన కోసం కాసేపు అదే నిజమనుకుందాం. క్రీస్తు సాయం చేసి ఉంటే, క్రైస్తవ దేశాల్లో దుష్టులూ దుర్మార్గులూ ఉండనేకూడదు. కానీ అలా లేదే. క్రైస్తవ దేశాల్లో ఎంతోమంది దుర్మార్గులు, దుష్టులూ ఉన్నారు కదా. దానిగురించి అడిగితే మతప్రచారకులు మాట మార్చేస్తారు. తాము ఇంకా చాలా పనిచేయాల్సి ఉందని చెబుతారు. అదెంత అసంబద్ధం’’ అని వివేకానంద తిరగబడ్డాడు.
హిందువులు అమితంగా గౌరవించే వేదాలను క్రైస్తవ మిషనరీలు తీవ్రంగా విమర్శిస్తారు. వివేకానంద వేదాలను దైవిక జ్ఞానాన్నిప్రసాదించే అద్భుత సాహిత్యంగా కొనియాడాడు. బ్రహ్మసామాజికులు వేదాలను బైబిలుకు అనుగుణంగా అన్వయించి చెప్పే ప్రయత్నం చేసారు. కానీ నిజానికి వేదాలు ప్రమాణంగా బైబిలును పరిశీలించి దాని గొప్పదనాన్ని నిరూపించాలని వివేకానంద ప్రశ్నించాడు. వేదాలను
అంగీకరించినంత మేరకు బైబిలును, ఇతర దేశాల మతగ్రంథాలనూ పరిగణించవచ్చు. కానీ అవి
వేదాలను అంగీకరించకపోతే వాటిని కనీసం పరిగణనలోకి అయినా తీసుకోనక్కరలేదు అని
వివేకానంద స్పష్టం చేసాడు.
మరో సందర్భంలో వివేకానంద ‘‘మనం మన ధర్మాన్ని అధ్యయనం చేయాలని వేదాలు చెబుతున్నాయి. వేదాలు సనాతనం, చిరంతనం. వాటిని మినహాయించి మిగతా మతాల గ్రంథాలన్నీ మార్చాలి. వేదాల ప్రామాణికత శాశ్వతం. మిగతా గ్రంథాలు అప్పటి కాలానికి మాత్రమే ప్రామాణికాలు’’ అని నిక్కచ్చిగా ప్రకటించాడు.
క్రైస్తవ మిషనరీల తదుపరి లక్ష్యం బ్రాహ్మణులు. హిందూధర్మానికి ధర్మకర్తలుగా ఉన్న బ్రాహ్మణులకు వివేకానంద అండగా నిలిచాడు. ‘‘మన పూర్వీకులకు గురుస్థానంలో నిలిచినవారు బ్రాహ్మణులు. వారు ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రవర్తనను కలిగి ఉండేవారు. ఐరోపాలో లార్డ్ ది కార్డినల్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది. తన పూర్వీకుల గొప్పదనాన్ని నిరూపించుకోడానికి కోట్లాది పౌండ్లు ఖర్చుపెట్టాల్సి వచ్చేది. అయితే తన పూర్వీకుల పరంపర ఎవరో భయంకరుడూ, క్రూరుడూ అయిన రాజు దగ్గర మొదలయ్యేంత వరకూ ఆ కార్డినల్‌కు తృప్తి ఉండదు. ఆ పూర్వీకుడు ఓ కొండపైన ఉంటూ దారినపోయే జనాలను చూస్తూ, వీలైనప్పుడు వాళ్ళమీద పడి వారిని దోచుకునేవాడు అయి ఉంటాడు.’’
‘‘కానీ భారతదేశపు రాజులు ఎవరో ఒక ప్రాచీన ఋషిపరంపరకు చెందినవాళ్ళు. ఆ ఋషులు ఓ చిన్న కౌపీనం ధరించి, ఏ అడవిలోనో ఉంటూ కందమూలాలు భుజిస్తూ వేదాలు అధ్యయనం చేస్తూ ఉండేవారు. సమస్తాన్నీ పరిత్యజించి ఆధ్యాత్మిక జీవనం గడిపే బ్రాహ్మణులే మన ఆదర్శపురుషులు. వారి వారసులమే మనం’’ అని వివేకానంద వివరించాడు.
హిందూధర్మానికి వ్యతిరేకంగా క్రైస్తవ మిషనరీలు అమెరికాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని వివేకానంద స్వయంగా గమనించాడు. హిందువులను నిందిస్తూ వారిని మతం మారుస్తామని చెబుతూ మిషనరీలు డబ్బులు సంపాదించే పద్ధతులను ఆయన చూసాడు. వారి పద్ధతులను వివేకానంద నేరుగానే దునుమాడాడు. మిషనరీల దుష్ప్రచారాన్ని వినేవారి మానసిక, నైతిక ఆరోగ్యం దారుణంగా పతనమైపోతుందని ఆయన నేరుగా వారినే హెచ్చరించాడు.
క్రైస్తవాన్నీ – మరీముఖ్యంగా క్రైస్తవ మిషనరీల మతమార్పిడి పద్ధతులనూ విమర్శించే వివేకానందుడు హిందూధర్మానికి కూడా ఒక సూచన చేసాడు. విదేశీ ఆక్రమణదారుల దురాగతాల వల్ల హిందూధర్మానికి దూరమైన వారిని స్వధర్మంలోకి తీసుకురావాలని – అంటే వారిని ఘర్‌వాపసీ చేయాలని – హిందూసమాజానికి పిలుపునిచ్చాడు. క్రైస్తవ, ముస్లిం మిషనరీలు భయపెట్టో భ్రమపెట్టో మతం మార్చిన వారిపట్ల హిందూధర్మం ఉదాసీనంగా ఉండకూడదని ఆయన చెప్పాడు. తమ పూర్వీకులు అనుసరించిన ధర్మంలోకి తిరిగి రావాలనుకునేవారికి హిందూఛాందసత్వం అడ్డంగా ఉంటోందనీ, దాన్ని అన్యమతస్తులు వాడుకుంటున్నారనీ వివేకానంద వివరించాడు. విదేశాల నుంచి దిగుమతి అయిన సిద్ధాంతాలపట్ల గాఢమైన అపనమ్మకం నుంచి పుట్టుకొచ్చిన గుడ్డి వ్యతిరేకతే హిందువుల ఛాందసత్వానికి కారణమని ఆయన అన్నాడు. ఏదోరకంగా సత్యాన్ని గ్రహించి తిరిగి వెనక్కి రావాలనుకునేవారికి హిందూధర్మం అవకాశం కల్పించాలని వివేకానంద స్పష్టం చేసాడు.