దేశవ్యాప్తంగా ఘనంగా జాతీయ యువజన దినోత్సవం
భారతీయ సనాతన ధర్మం గురించి ప్రపంచానికి వివరించిన ఆధ్యాత్మిక వేత్త, యువతకు ప్రేరణదాత అయిన శ్రీ స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవాన్ని అధికారికంగా ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, విపక్షనేతలు, ఉన్నతాధికారులు వివేకానందుడు, యువత వికాసానికి వేసిన బాటలను గుర్తు చేసుకున్నారు.
హిందూ సంస్కృతి వైభవాన్ని విశ్వ యవనిక పై ఎలుగెత్తి చాటిన మహామేధావి స్వామి వివేకానంద.గ్రెగోరియన్ కేలండర్ ప్రకారం 1863 జనవరి 12 మకర సంక్రాంతి రోజున కలకత్తా నగరంలోని భువనేశ్వరి దేవి, విశ్వనాథ ద త్త దంపతులకు జన్మించారు. బాలునికి తల్లిదండ్రులు నరేంద్రుడు అనే నామధేయాన్ని పెట్టారు. చిన్ననాటి నుంచే దాతృత్వం, నేతృత్వం, కర్తృత్వం, సమరసత, సత్యశోధన, తాత్విక చింతన, ఏకాగ్రత, ధీరోదాత్తత వంటి సుగుణాలెన్నో మన నరేంద్రునిలో పరిఢవిల్లాయి.
స్వామి వివేకానంద తన జీవితం మొత్తాన్ని యువత కోసం వినియోగించారు. అందుకే ఆయన పుట్టినరోజైన జనవరి 12న ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
స్వామి వివేకానంద 1893 సెప్టెంబరు 11న చికాగోలో ప్రపంచ మతాల సమ్మేళనంలో చేసిన ఉపన్యాసం అద్భుతం. ‘‘ప్రపంచంలోని అత్యంత పురాతన సన్యాసుల తరఫునా, మతాలకే మాత అయిన సనాతన ధర్మ తరఫునా, హిందూ మతానికి చెందిన అన్ని వర్గాలు, తెగలకు చెందిన లక్షలాదిమంది ప్రజల తరఫునా పేరు పేరునా ధన్యవాదాలు’ అన్నారు. అలాగే ‘ప్రపంచానికి సహనం, సార్వత్రిక అంగీకారం రెండింటినీ బోధించిన మతానికి చెందినవాడిగా నేను గర్వపడుతున్నాను.’’ అని ఆయన చేసిన ప్రసంగం ఎప్పటికీ మరువలేనిది. భూమిపై ఉన్న అన్ని మతాలకూ, దేశాలకూ చెందిన బాధితులకూ, శరణార్థులకూ ఆశ్రయం కల్పించిన దేశానికి చెందినవాడిగా నేను గర్విస్తున్నాను’ అని ఎలుగెత్తి చాటిన మహానుభావుడు శ్రీ స్వామి వివేకానంద.
‘‘ లేవండి, మేల్కోండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి’’ అని స్వామి ఇచ్చిన పిలుపు ఎంతో మంది ఉన్నతా స్థాయికి ఎదిగి తమ జీవితాలను సంస్థలను తీర్చిదిద్దుకున్నారు.
స్వామి వివేకానందకు హిందూ మత ఆధ్యాత్మిక రాయబారి, కర్మయోగి అని బిరుదులు ఉన్నాయి. రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠం అనే సంస్థలను స్థాపించారు. నా నరేంద్రుడు విశ్వానికి వెలుగునిచ్చే జ్ఞాన సూర్యుడు అని రామకృష్ణ పరమహంస అన్నారు.