త్రివేణి సంగమమైన ప్రయాగ్ రాజ్ లో పన్నెండు ఏళ్ళకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కుంభమేళా సందర్భంగా పవిత్ర స్నానం ఆచరించేందుకు హిందువులతో పాటు విదేశీయులు కూడా తరలి వస్తున్నారు.
యాపిల్ కంపెనీ సహవ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ సతీమణి లారెన్స్ పావెల్ కు సనాతన ధర్మంపై అపారమైన విశ్వాసం ఉంది. దీంతో ఆమె మహా కుంభమేళాలో పాల్గొనేందుకు భారత్ వచ్చారు. శనివారం కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకున్నారు. పావెల్ కు నిరంజన్ అఖాడాకు చెందిన స్వామి కైలాశానంద్ గిరి జి మహారాజ్ స్వాగతం పలికి ఆమెను ఆలయం వరకు తోడ్కొని వెళ్లి స్వామి వారి దర్శనం కల్పించారు. ఆమెతో ప్రత్యేక పూజలు చేయించారు.
పావెల్ హిందూ సంప్రదాయం పాటిస్తారని, మహా కుంభమేళాలో పాల్గొనేందుకు భారత్ వచ్చారని తెలిపారు. సంప్రదాయ దుస్తుల్లో లారెన్స్ పావెల్ ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకున్నారు.