భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)స్పేడెక్స్ ఉపగ్రహాల పనితీరుపై చేస్తోన్న ప్రయోగ ప్రక్రియలో కీలక ముందుడుగు పడింది. శనివారం నాడు ఉపగ్రహాల మధ్య దూరం 230 మీటర్లుగా ఉండగా ఆదివారం నాడు తొలుత 15 మీటర్లకు చేరుకోగా, ఆ తరువాత ఇస్రో ఆ రెండు శాటిలైట్లను మూడు మీటర్ల మేరకు దగ్గరకు తీసుకువచ్చింది. అనంతరం సురక్షితంగా తిరిగి వెనక్కు తీసుకురాగలిగింది.
స్పేడెక్స్ ప్రయోగానికి సంబంధించిన డేటాను సమగ్రంగా విశ్లేషించిన తర్వాత డాకింగ్ ప్రక్రియను చేపడతామని ఇస్రో తెలిపింది. శాటిలైట్లలోని వ్యవస్థలన్నీ సక్రమంగా ఉన్నాయని ఇస్రో పేర్కొంది.
ఎస్‌డీ01 (ఛేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్) సక్రమమైన స్థితిలోనే ఉన్నాయని వివరించింది. వాటి మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తగ్గించే ట్రయల్ రన్ విజయవంతమైంది. ప్రస్తుతం రెండు ఉపగ్రహాలు సురక్షిత దూరంలో ఉన్నాయని ఇస్రో ఒక ట్వీట్‌లో పేర్కొంది.
స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమైతే ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. ఈ తరహా సాంకేతికత అమెరికా, రష్యా, చైనా వద్ద ప్రస్తుతం ఉంది. చంద్రుడి నుంచి నమూనాలను సేకరించడం, అక్కడి నుంచి భూమిపైకి తీసుకురావడం, స్సేస్ స్టేషన్ ఏర్పాటు, 2040 నాటికి చంద్రుడిపైకి మనుషుల్ని పంపడం వంటి లక్ష్యాలకు ఈ ప్రయోగం ఎంతో అవసరం.