దిల్లీ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ, అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 29 మంది అభ్యర్థులకు రెండో జాబితాలో చోటు దక్కింది. దిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా, రెండు జాబితాలు కలిపి బీజేపీ ఇప్పటి వరకూ 58 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇంకో 12 స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి ఉంది.
దిల్లీ మాజీ సీఎం మదన్ లాల్ ఖురానా తనయుడు హరీశ్ ఖురానా మోతీ నగర్ నుంచి కమలం గుర్తుపై పోటీకి దిగుతున్నారు. ఇటీవలే ఆప్ నుంచి బీజేపీలో చేరిన ప్రియాంక గౌతమ్ కౌండ్లీ నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ దిల్లీ ఉపాధ్యక్షుడు కపిల్ మిశ్రా కరావల్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుంది. 8న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ఆప్ ఇప్పటికే 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ మాత్రం కొన్ని స్థానాలకే అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది.