అయోధ్యలో శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్రంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగి ఏడాది గడిచిన సందర్భంగా ఇవాళ ఉత్సవం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని శిల్పి అరుణ్ యోగిరాజ్, శ్రీరాముడి మూర్తిని చెక్కడానికి తాను ఉపయోగించిన పరికరాలను ప్రదర్శించారు.
అరుణ్ యోగిరాజ్ తన స్టూడియోలో ప్రదర్శనకు పెట్టిన వస్తువుల్లో ఒక బంగారు ఉలి, వెండి సుత్తి, ఒక పెడస్టల్ ఉన్నాయి. వాటితోనే బాల రాముడి మూర్తికి రూపకల్పన చేసినట్లు అరుణ్ యోగిరాజ్ వెల్లడించారు. బాలరాముడి మూర్తిని తయారు చేయడంతో తన పేరు దేశంలో ప్రతీ ఇంటికీ తెలిసిపోయిందని ఆయన ఆనందం వ్యక్తం చేసారు. తనకు గుర్తింపు పెరిగిందని, తన స్టూడియోకు వచ్చే సందర్శకులు పెరిగారనీ సంతోషంగా చెప్పారు.
అరుణ్ యోగిరాజ్ ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ రాతిశిల్పాన్ని చెక్కే అవకాశం దక్కించుకున్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు అంకితంగా నిర్మిస్తున్న మందిరంలో ఆ శిల్పాన్ని ఏర్పాటు చేస్తారు. శివక్రాంతి ఫౌండేషన్ అనే సంస్థ ముంబై చేరువలోని థానేలో మరాడే పాడా ప్రాంతంలో ఒకటిన్నర ఎకరాల్లో ఆ మందిరాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.