తమిళనాడు కోయంబత్తూరు శివార్లలోని గణపతి ఉదయంపాళయం గ్రామంలో కొద్దిరోజుల క్రితం ఒక జంట తోపుడుబండి మీద బీఫ్ అమ్మే వ్యాపారం మొదలుపెట్టారు. అయితే స్థానికంగా ప్రసిద్ధమైన వీరమత్తి అమ్మన్ కోవెల దగ్గర వారు బండి పెట్టడం వివాదానికి దారి తీసింది. గుడి నిర్వాహకులు, స్థానిక హిందువులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా వారు పట్టించుకోకుండా అక్కడే బీఫ్ అమ్ముతున్నారు. దాంతో స్థానికులు, హిందూ సంఘాలు ఆ బండిని అక్కణ్ణుంచి తరలించాలంటూ నిరసనలు చేపట్టారు.
గణపతి ఉదయంపాళయం గ్రామంలో మారిఅమ్మన్, వీరమత్తి అమ్మన్, కరుప్పరాయన్ కోవెలలు ఉన్నాయి. వాటిలో వీరమత్తి అమ్మన్ గుడిని చుట్టుపక్కల ఎనిమిది గ్రామాల ప్రజలు తమ సొంత కోవెలగా భావిస్తారు. అక్కడ పూజాదికాలు చేస్తుంటారు.
రవి అనే హిందువు, అతని ముస్లిం భార్య అబిత ఉదయంపాళయంలోని అంబేద్కర్ కాలనీలో నివసిస్తున్నారు. వాళ్ళు కొన్నాళ్ళ క్రితం తోపుడుబండి మీద బీఫ్ బిర్యానీ వ్యాపారం ప్రారంభించారు. గ్రామంలోని ఎస్ఎస్ కుళం మిడిల్ స్కూల్ దగ్గర వారు బండి పెట్టుకున్నారు. ఆ ప్రాంతంలో మాంసాహారం విక్రయించే స్టాల్స్ కొన్ని ఉన్నాయి. అయితే దగ్గరలోనే గుడి, బడి ఉన్నందున అక్కడ బీఫ్ అమ్మడం మునిసిపాలిటీ నియమాలకు విరుద్ధమని, అక్కడ బీఫ్ విక్రయించవద్దనీ స్థానికులు చెప్పారు. దుకాణాన్ని వేరే చోటకు మార్చడానికి రవి మొదట ఒప్పుకున్నాడు. కానీ అతని భార్య అబిత మాత్రం ఒప్పుకోలేదు.
గతేడాది డిసెంబర్ 25న, తర్వాత ఈ యేడాది జనవరి 5న స్థానిక బీజేపీ నాయకుడు సుబ్రమణి, మరో ముగ్గురు వ్యక్తులూ తమ జంటను బెదిరించాంటూ అబిత కోయంబత్తూరు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఆ ప్రాంతంలో మిగతా మాంసాహారాలను అమ్ముతున్నప్పుడు బీఫ్ బండిని మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆమె ప్రశ్నించింది. అబిత ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సుబ్రమణి, తదితరుల మీద కేసు రిజిస్టర్ చేసారు
బీజేపీ నాయకుడు సుబ్రమణి ఆరోజు జరిగిన సంఘటనను చిత్రీకరించాడు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసాడు. గుడి దగ్గర బీఫ్ అమ్మనీయరాదన్న నిర్ణయానికి సీపీఎం కౌన్సిలర్ వి. రామమూర్తి కూడా మద్దతు పలికారు. విషయం పెద్దదై గొడవలు మొదలయ్యాయి. ఆ క్రమంలో జనవరి 8న స్థానిక హిందువులు, బీజేపీ క్యాడర్, హిందూ మున్నని సభ్యులు సుమారు వెయ్యిమంది గ్రామంలో నిరసన చేపట్టారు.
హిందూ మక్కల్ కచ్చి అనే సంస్థ ఆ వివాదం గురించి ఎక్స్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. ‘‘ముస్లిం ప్రాంతంలో పోర్క్ దుకాణం ప్రారంభిస్తే ఒప్పుకుంటారా? ఆమె గుడి దగ్గరే బీఫ్ దుకాణం పెట్టాలని పట్టుపడుతోంది, దాన్ని స్వతంత్రం అంటున్నారు’’ అంటూ ట్వీట్ చేసింది.
ఆ నేపథ్యంలో గ్రామ కమిటీ, వివాదాస్పద బీఫ్ బండి సహా గుడి దగ్గరున్న ఏడు ఫుడ్ సెంటర్లను ఖాళీ చేయించింది. స్థానిక కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఆ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఆహార హక్కులను రక్షించాలంటూ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసారు. అదే సమయంలో బీఫ్ వ్యాపారంతో ఆ దంపతులు తమ మనోభావాలను దెబ్బ తీస్తున్నారంటూ గ్రామపెద్ద వి పళనిసామి, తూడియలూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు.
గొడవ పెద్దది అవుతుండడంతో పోలీసు అధికారులు గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. వారంతా సుబ్రమణి చెప్పిన విషయాలను ధ్రువీకరించారు. ఆ జంట బీఫ్ అమ్మడానికి తామంతా వ్యతిరేకమని స్పష్టం చేసారు. సుబ్రమణి తదితరుల మీద పెట్టిన కేసును తొలగించాలని డిమాండ్ చేసారు. అది కుదరకపోతే రవి, అబిత జంట మీద తమ ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేయాలని కోరారు. ఆ జంట స్థానికంగా శాంతిభద్రతలను చెదరగొడుతున్నారని, హిందువుల విశ్వాసాలను గాయపరుస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేసారు. పోలీసులు గ్రామస్తుల డిమాండ్లను పరిగణిస్తామనీ, ఆందోళన విరమించాలనీ వారిని కోరారు.
మరోవైపు అబిత, ఆమె భర్త ఈ విషయాన్ని హిందూ ముస్లిం గొడవగా మార్చి మరింత పెద్దస్థాయికి రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని శక్తులు వారికి అండగా నిలుస్తున్నాయని, ఈ విషయాన్ని పెద్ద వివాదంగా మార్చడానికి కుట్ర పన్నుతున్నాయనీ వారు ఆందోళన చెందుతున్నారు. గుడి దగ్గర బీఫ్ అమ్మవద్దని సౌమ్యంగా చెప్పినా వినకుండా అతిగా వ్యవహరించి విషయాన్ని రచ్చ చేసారని చెబుతున్నారు. బండి తీసేయాలంటూ ఆందోళన చేసిన వారిపై రవి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని సమాచారం.
రవి, అబిత జంట ఉద్దేశపూర్వకంగానే గుడి దగ్గర బీఫ్ షాపు పెట్టారని హిందువులు మండిపడుతున్నారు. మసీదు దగ్గర పోర్క్ షాపు లేదా చర్చ్ దగ్గర బిర్యానీ షాపు పెట్టుకోవచ్చు కదా. అలా చేయలేరు కానీ గుడి దగ్గర బీఫ్ బండి పెట్టారు, ఉద్దేశపూర్వకంగా వివాదం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని రాజకీయ శక్తులు వారికి అండగా ఉన్నాయి. గుడి దగ్గర బీఫ్ షాపు పెట్టడాన్ని వారు తమ ప్రాథమిక హక్కుగా వాదిస్తున్నారు. కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న విషయాన్ని విస్మరిస్తున్నారు అంటూ హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.