ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ముస్లింలు మెజారిటీగా ఉండే ప్రదేశంలో వందేళ్ళకు పైగా మూతపడి ఉన్న సిద్ధేశ్వర్ మహాదేవ్ మందిరం ఇవాళ తెరుచుకుందని సనాతన్ రక్షా దళ్ ప్రకటించింది. గుడిని తిరిగి తెరిచే కార్యక్రమానికి జిల్లా అధికారులు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు, స్థానికులు హాజరయ్యారు. జనవరి 14 తర్వాత నుంచి గుడిలో నిత్యపూజాదికాలు ప్రారంభిస్తారు. దానికి ముహూర్తం కాశీ విద్వత్ పరిషత్, అన్నపూర్ణ ఆలయ నిర్వాహకులు, ఇతర పండితులతో చర్చించి నిర్ణయిస్తారు.
సనాతన్ రక్షా దళ్ గత నెల ఈ శివాలయం ఉన్న స్థలం యాజమాన్య హక్కులు తమవని చూపించుకుంది. గుడిని మళ్ళీ తెరవడానికి, అక్కడ మళ్ళీ నిత్యపూజాదికాలు నిర్వహించుకోడానికి అనుమతి కోరింది. ఆ గుడి తెరిచినప్పుడు చెత్తాచెదారంతో పాటు మూడు పాడైన శివలింగాలు కూడా లభించాయి.
సిద్ధేశ్వర్ మహాదేవ్ మందిరం వందకు పైగా ఏళ్ళ నుంచీ మూతపడి ఉందని కాశీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ బన్స్‌వాల్ వెల్లడించారు. అక్కడి శిథిలాలను, చెత్తను తీసివేసి శుభ్రం చేస్తామని, కళాఖండాలు ఏమైనా లభిస్తే వాటిని సంరక్షిస్తామనీ చెప్పారు.
మందిరాన్ని మళ్ళీ తెరిచేందుకు ఎలాంటి వ్యతిరేకతా లేదని జిల్లా అదనపు కలెక్టర్ అలోక్ వర్మ చెప్పారు. స్థానిక ప్రజలు పూర్తిగా సహకరించారన్నారు. గుడిలో రెండడుగుల కంటె ఎక్కువ ఎత్తులో మట్టి, చెత్త పేరుకుపోయాయని వివరించారు. గుడిలో నిత్యపూజాదికాల గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.