ఓ వైపు మంచు తుఫాను, మరోవైపు కార్చిచ్చు అమెరికా ప్రజలను అల్లాడిస్తున్నాయి. పది రాష్ట్రాల్లో 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మంచు తుఫాను విరుచుకుపడింది. 9 కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక కాలిఫోర్నియాలో కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. లాస్ ఏంజెలెస్ నగరం స్మశానంలా మారింది. పది వేల ఇళ్లు కాలిపోయాయి. హాలీవుడ్ నటుల ఇళ్లు కూడా కాలిపోవడంతో కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.మూడున్నర లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పాలిసేడ్స్ ప్రాంతంలో 35 వేల ఎకరాల్లో మంటలు అంటుకున్నాయి. 60 కి.మీ వేగంతో గాలులు వీస్తూ ఉండటంతో మంటలు అదుపు చేయడం కష్టసాధ్యంగా మారింది. 13 లక్షల కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని బీమా కంపెనీలు అంచనా వేశాయి. మంటలు వ్యాపిస్తోన్న ప్రాంతాల్లో కొత్తగా కంపెనీు బీమా పాలసీలను అమ్మడం ఆపేశారు. కొన్ని బీమా కంపెనీలకు దివాలా తీసే ప్రమాదం పొంచి ఉంది. దేశంలో దారుణ పరిస్థితులు నెలకొనడంతో అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షులు కమలా హారిస్ తమ పర్యటనలు రద్దు చేసుకున్నారు.
డెల్టా స్మెల్ట్ చేపలను రక్షించేందుకు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ నీటి ఒప్పందాలను పునరుద్దరించుకోలేదని, అందుకే ఈ సమస్య వచ్చిందని ట్రంప్ విరుచుకుపడ్డారు. తక్కువ నీటిలో పెరిగే డెల్టా స్మెల్ట్ చేపల కోసం నీటి నిల్వలు పెంచకపోవడంతో మంటలు అదుపు చేసేందుకు ఫైర్ ఫైటర్స్‌కు తగినంత నీరు లభించడం లేదు. దీంతో మంటలు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. లాస్ ఏంజెలెస్ నగరం మరుభూమిని తలపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి విపత్తు ఇంత వరకు చూడలేదని విలపిస్తున్నారు.