అయోధ్యంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మొదటి వార్షికోత్సవం ఘనంగా జరుగుతోంది. నేడు పుష్య శుక్ల ద్వాదశి సందర్భగా నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో 110 మంది వీఐపీలు పాల్గొననున్నారు.
మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా ఉదయం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ్‌లల్లాకు అభిషేకం నిర్వహించారు.భక్తుల కోసం అంగద్ తిలా స్థలంలో ఒక భారీ టెంట్ ఏర్పాటు చేశారు. దాదాపు ఐదు వేలమంది భక్తులు కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు.
శాస్త్రీయ సాంస్కృతిక ప్రదర్శనలు, రామ కథా గానం కూడా నిర్వహిస్తున్నారు. గత ఏడాది జరిగిన ప్రతిష్టకు రాలేకపోయిన వారి కోసం ఈసారి ట్రస్ట్ ప్రత్యేక ఆహ్వానాలు పంపిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
రామాలయ వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటం తర్వాత బాలరాముడి ఆలయం నిర్మించుకున్నామని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు అయోధ్య బాలరాముడి ఆలయం ఘన వారసత్వంగా నిలిచిందన్నారు.