జనవరి నెలకు పన్నుల వాటా విడుదల
సంక్రాంతి వేళ రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పన్నుల వాటా కింద రూ.1,73,030 కోట్లు నిధులను రాష్ట్రాలకు విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు రూ.7002 కోట్లు, తెలంగాణకు రూ.3637 కోట్లు విడుదలయ్యాయి.
దేశంలోని 28 రాష్ట్రాలు/యూటీలకు రూ.1,73,030 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడం, రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, సంబంధిత ఖర్చుల కోసం అధిక మొత్తంలో నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
పన్నుల వాటాలో ఉత్తరప్రదేశ్‌కు అత్యధికంగా రూ.31,039 కోట్లు విడుదల కాగా ఆ తర్వాతి స్థానంలో బిహార్ రూ.17,403 కోట్లు ఉంది. మధ్యప్రదేశ్‌కు రూ.13,582 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.13,017 కోట్లు, గోవాకు రూ.667 కోట్ల వాటాను రిలీజ్ చేసింది. మహారాష్ట్రకు రూ.10,930.31 కోట్లు, రాజస్థాన్‌కు రూ.10,426.78, తమిళనాడుకు రూ.7057.89 కోట్లు
సిక్కింకు రూ.671.35 కోట్లు విడుదల అయ్యాయి.
గత డిసెంబర్ లో పన్నుల వాటా కింద రాష్ట్రాలకు కేంద్రం కేవలం రూ.89,086 కోట్లు విడుదల చేసింది. నిబంధనల మేరకు ఒక ఆర్థిక సంవత్సరంలో 14 వాయిదాల్లో కేంద్ర పన్నుల వాటాను రాష్ట్రాలకు పంపిణీ చేసే అవకాశం ఉందని కేంద్రం వెల్లడించింది.