మహిళల క్రికెట్ పోటీలో భాగంగా ఐర్లాండ్, భారత్ మధ్య మూడు మ్యాచ్ ల సిరీస్ జరుగుతోంది. నేడు రాజ్ కోట్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఐర్లాండ్ పై విజయం సాధించింది. దీంతో సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ ఇదే స్టేడియంలో జనవరి 12న జరగనుంది.
టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ అద్భుతంగా ఆడింది. ఐర్లాండ్ విధించిన 239 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా సాధించింది. 34.3 బంతుల్లో నాలుగు వికెట్లు నష్టపోయి241 పరుగులు చేసి విజయం సాధించింది. ప్రతిక రావల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు. ప్రతిక 96 బంతుల్లో 89 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్ లో పది ఫోర్లు, ఓ సిక్స్ ఉన్నాయి.
ప్రతిక రావల్ (89), తేజల్ (53*), స్మృతి మంధాన (41) రాణించడంతో భారత్ కు సునాయసంగా విజయం దక్కింది.
ఐర్లాండ్ బౌలర్లలో అమీ మగూర్ మూడు వికెట్లు తీయగా, ఫ్రేయా సర్జంట్ ఓ వికెట్ పడగొట్టింది.
ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ గాబీ లెవిస్ 129 బంతుల్లో 92 పరుగులు చేయగా మిడిలార్డర్ బ్యాటర్ లియా పాల్ 73 బంతుల్లో 59 పరుగులు చేసింది. అర్లీన్ కెల్లీ 25 బంతుల్లో 28 దూకుడుగా ఆడింది.