రచయిత, యాక్టివిస్టు అయిన దిలీప్ మండల్ ఎక్స్ మాధ్యమం ద్వారా సంచలనాత్మక ప్రకటన చేసాడు. మన దేశంలో మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయినిగా పేరు గడొంచిన ఫాతిమా షేక్ అనే వ్యక్తి నిజానికి ఎవరూ లేనే లేరని వెల్లడించాడు. ఫాతిమా షేక్ అనేది తను సృష్టించిన ఊహాత్మక పాత్ర అని వెల్లడించాడు. నిజజీవితంలో అలాంటి వ్యక్తి ఎవరూ లేనే లేరని స్పష్టం చేసాడు. ఇంక చరిత్రలో ఫాతిమా షేక్ లేనే లేదని కుండ బద్దలు కొట్టాడు.
ఫాతిమా షేక్ అనే వ్యక్తి లేనే లేదు కాబట్టే ఆమెకు సంబంధించి ఎలాంటి ఫొటోగ్రాఫ్లూ ఎక్కడా లేవనీ, వాడుకలో ఉన్న చిత్రం కూడా కల్పించినదేననీ దిలీప్ మండల్ వెల్లడించారు.
‘నేరాంగీకారం’ పేరుతో ఎక్స్ మాధ్యమంలో పెట్టిన పోస్ట్ ద్వారా దిలీప్ మండల్ ఫాతిమా షేక్ అనే పాత్రను సృష్టించింది తానేనని స్పష్టం చేసాడు. ‘‘నన్ను క్షమించండి. నిజమేంటంటే ‘ఫాతిమా షేక్’ అనే వ్యక్తి నిజానికి ఎప్పుడూ లేదు. ఆమె చారిత్రక వ్యక్తి కాదు, అసలు నిజమైన మనిషే కాదు. ఒక నిర్దిష్ట సమయంలో నేను ఊరికే ఆ పేరును పుట్టించాను. ఆ పని నేను ఉద్దేశపూర్వకంగానే చేసాను’’ అని వివరించాడు.
తను ఫాతిమా షేక్‌ను పుట్టించడానికి ముందు గూగుల్‌లో ఆమె గురించి ఒక్క ఎంట్రీ కూడా లేదని చెప్పాడు. అసలు ఆమె గురించి ఒక్క వ్యాసం, ఒక్క పుస్తకం, కనీసం ఒక్క ప్రస్తావన కూడా ఎక్కడా లేదని స్పష్టం చేసాడు. ఆ పాత్ర పట్ల తనకు ఆసక్తి తగ్గిపోయాక 2022 నుంచీ ఆ పాత్ర గురించి తాను మాట్లాడలేదని వివరించాడు. ఫాతిమా షేక్ సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా వచ్చింది, అలాగే మాయమైపోయింది అని చెప్పాడు.
అసలు ఫాతిమా షేక్ పాత్రను ఎందుకు పుట్టించాడన్న విషయం మాత్రం తనను అడగవద్దని దిలీప్ మండల్ అన్నాడు. ‘‘ఆ సమయంలో ఆ సందర్భంలో ఒక ప్రయోజనం కోసం ఒక పాత్రను నిర్మించవలసి వచ్చింది. ఆమె పేరు మొట్టమొదటిసారి నానుంచే వేలాదిమందికి తెలిసింది. ఒక నెరేటివ్ తయారుచేసే కళలో, ఒక వ్యక్తికి ఒక ఇమేజ్ కల్పించడంలో నేను ఆరితేరిన దిట్టని. అందవల్ల ఫాతిమా షేక్‌ను తయారుచేయడం నాకు కష్టం కాలేదు. అంతకు ముందు పాత ఫొటోలు ఏమీ లేవు కాబట్టి ఒక ఊహాత్మక స్కెచ్‌ను కల్పించాను. ఆమె గురించి నేను ఎన్నెన్నో కథలు అల్లాను, అలా ఫాతిమా ఉనికిలోకి వచ్చింది. ఆ కథ బాగా వ్యాపించింది. రాజకీయ, సైద్ధాంతిక అవసరాల కోసం ఈ నెరేటివ్ కావలసిన వాళ్ళు ఆమెకు మరింత ప్రచారం కల్పించారు’’ అంటూ దిలీప్ మండల్ ఎక్స్‌లో రాసాడు.
‘‘జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలేల సమగ్ర సాహిత్యం ప్రచురితమైంది. తమతో పాటు ఫాతిమా షేక్ పనిచేసిందని వారు ఎక్కడా ప్రస్తావించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం అలాంటి ఒక పేరును ఎప్పుడూ ప్రస్తావించలేదు. జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే జీవితచరిత్రల్లో ఎక్కడా ఫాతిమా షేక్ పేరు ఉండదు. 15ఏళ్ళ క్రితం వరకూ ఏ ముస్లిం పండితుడూ ఫాతిమా షేక్ పేరును ప్రస్తావించలేదు. ఫూలే దంపతుల విద్యాప్రచార ప్రయత్నాల గురించి రాసిన బ్రిటిష్ డాక్యుమెంట్లలో కూడా ఎక్కడా ఫాతిమా షేక్ లేదు. అసలు చరిత్రలో ఆమె ఎక్కడా కనిపించదు. ఆమెను కల్పించి, ఆమెకు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది నేనే. అందుకే నా రాతల్లో తప్ప ఇంకెక్కడా ఫాతిమా లేదు. ఆ విషయాన్ని ఒప్పుకుంటన్నాను’’ అని దిలీప్ మండల్ వివరించాడు.
జ్యోతిబా ఫూలే భార్య సావిత్రీబాయి ఫూలే భారతదేశంలో మహిళావిద్యకు ప్రారంభకురాలు అనే ప్రచారం గత కొన్నాళ్ళుగా జరుగుతోంది. ఆమెతో పాటు ఫాతిమా షేక్ అనే ముస్లిం మహిళ పని చేసిందనీ, ఆమె మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయిని అనీ ప్రచారం జరిగింది. ఆ ఫాతిమా షేక్ తను సృష్టించిన పాత్ర అని, కొన్ని ప్రయోజనాల కోసమే ఆమెను 15ఏళ్ళ క్రితం సృష్టించాననీ దిలీప్ మండల్ స్పష్టం చేసాడు.