అగ్రరాజ్యం అమెరికాను కార్చిచ్చు నిద్రలేకుండా చేస్తోంది. వారం రోజులుగా లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో కార్చిచ్చు 3 వేల గృహాలను బుగ్గి చేసింది. 3 లక్షల మంది ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. 34 వేల ఎకరాల్లో అడవులు కాలిపోయాయి. 60 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. హాలివుడ్ స్టూడియో సమీపంలోకి మంటలు వ్యాపించాయి. ఫైర్ ఫైటర్స్ మంటలు అదుపు చేయడంతో స్టూడియోకు ప్రమాదం తప్పింది.
అంతరిక్షం నుంచి కూడా మంటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని మాక్స్ సంస్థ శాటిలైట్ చిత్రాల వివరాలతో విడుదల చేసింది. మంటలు, పొగ, కాలిపోయిన ప్రాంతాలను స్పష్టంగా గుర్తించేలా చిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా హాలివుడ్ ప్రముఖులు నివసించే సంపన్న ప్రాంతాల్లో మంటలు పెను నష్టం కలిగించాయి. కట్టుబట్టలతో జనం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దాదాపు రూ.5 లక్షల కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు గుర్తించారు. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
1983 నుంచి అమెరికాలో కార్చిచ్చులు క్రమంగా పెరుగుతున్నాయి. నవంబరు నుంచి జనవరి వరకు లాస్ ఏంజెలెస్ ప్రాంతంలో 14 సెం.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో పొడి వాతావరణం కార్చిచ్చును మరింత పెద్దది చేసిందని అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఏటికేడాది అమెరికాలో కార్చిచ్చులు పెరిగిపోతున్నాయి.
లాస్ ఏంజెలెస్‌కు నీటి సరఫరా తగ్గించడం వల్లే మంటలు అదుపులోకి రావడం లేదని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. బైడెన్ ప్రభుత్వం మంటలు అదుపు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శలు గుప్పించారు. కావాలనే నీటి సరఫరా తగ్గించారంటూ ట్రంప్ చేసిన విమర్శలు వైరల్ అయ్యాయి.