క్విక్ కామర్స్ రంగంలో రాబోయే మూడేళ్లలో 24 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుందని నియామకాల సంస్థ ఇండీడ్ సర్వేలో తేలింది. ముఖ్యంగా బ్లూకాలర్ ఉద్యోగాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని తన సర్వేలో తేలిందని సంస్థ సీఈవో వెల్లడించారు. పండుగల సీజన్‌లో క్విక్ కామర్స్ సంస్థలు 40 వేల మందిని అదనంగా తీసుకుంటున్నాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో క్విక్ కామర్స్ రంగం వేగంగా విస్తరిస్తోందని చెప్పారు.
రాబోయే మూడేళ్లలో క్విక్ కామర్స్ రంగంలో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, సహాయకులకు డిమాండ్ ఉంటుందని ఇండీడ్ సర్వే నివేదిక వెల్లడించింది. వీరి సగటు వేతనం రూ.22600 ఉంటుందని అంచనా. ముఖ్యంగా ముంబై, పుణే, చెన్నై, ఢిల్లీ లాంటి నగరాల్లో ఎక్కువగా నియామకాలు ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఆ తరవాత టు టైర్ నగరాల్లో కూడా నియామకాలు ఉంటాయని సర్వే ద్వారా తేలింది.
రాబోయే మూడేళ్లలో క్విక్ కామర్స్ రంగం దేశంలో 400 బిలియన్ డాలర్ల టర్నోవర్ సాధిస్తుందని అంచనా. ఏటా దేశంలో ప్రస్తుతం 12 లక్షల కోట్ల ఆన్ లైన్ బిజినెస్ జరుగుతోంది. క్విక్ కామర్స్ వేగంగా విస్తరిస్తోంది. బుక్ చేసిన పది నిమిషాల్లో డెలివరీ చేసే సంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో ఈ రంగంలో నియామకాలు కూడా భారీగా జరగనున్నాయి.