తిరుపతిలో పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన పై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ప్రమాద ఘటన పై విచారం వ్యక్తం చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అధికారుల వైఫల్యాలను ముఖ్యమంత్రి గమనించారన్నారు.
‘‘టికెట్ కేంద్రం వద్ద ఓ మహిళకు షుగర్ లెవల్స్ తగ్గిపోవడంతో ఆమెను ఆస్పత్రికి పంపేందుకు గేటు తెరిచారు. అయితే టోకెన్ల కోసం గేట్లు తెరిచారని భక్తులు ఎగబడి ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో ప్రమాదం జరిగింది.’’ అని తెలిపారు.
టికెట్ జారీ కేంద్రం వద్ద ఇన్ ఛార్జిగా ఉండాల్సిన డీఎస్సీ ర్యాంక్ పోలీసు అధికారి విధుల్లో లేరన్నారు.
తొక్కిసలాటలో చనిపోయిన ఆరుగురికి వెంటనే పోస్టుమార్టం చేసి అంబులెన్స్‌ల్లో మృతదేహాలను, ప్రత్యేక వాహనాల్లో సొంతూళ్ళకు పంపామన్నారు. రెవెన్యూ అధికారిని కూడా వారి వెంట తోడుగా పంపించామని వివరించారు. మృతుల్లో నలుగురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కాగా మిగతా ఇద్దరు తమిళనాడు, కేరళకు చెందిన వారు.