వచ్చే వారం ప్రయాగరాజ్‌లో ప్రారంభం కానున్న మహాకుంభమేళాలో భక్తులకు ఆహారం అందించేందుకు ఇస్కాన్ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ కుంభమేళా జరిగే అన్ని రోజులూ భక్తులకు మహాప్రసాదం పంచిపెడతారు.
ఈ విషయం గురించి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఎక్స్‌లో ట్వీట్ చేసారు. ‘‘మహాకుంభమేళాలో ఇస్కాన్‌తో కలిసి పనిచేయడం మా అదృష్టం. భక్తుల కోసం మహాప్రసాద సేవ ప్రారంభిస్తున్నాం. అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో లక్షల మంది భక్తులకు ఉచితంగా ఆహారం అందజేస్తాం’’ అని ఆ ట్వీట్లో రాసుకొచ్చారు.
ఈ మహాప్రసాద కార్యక్రమం గురించి చర్చించడానికి ఇస్కాన్ గవర్నింగ్ బాడీ కమిషన్ చైర్మన్ గురుప్రసాద స్వామితో గౌతమ్ అదానీ గురువారం భేటీ అయ్యారు. ‘‘స్వామితో సమావేశం అయ్యాను. అంకితభావంతో సేవ చేయడానికి ఉన్న శక్తి నాకు అనుభవంలోకి వచ్చింది. సేవ అనేది దేశభక్తికి అత్యున్నత రూపం. సేవే ధ్యానం, సేవే ప్రార్థన, సేవే దైవం’’ అని గౌతమ్ అదానీ చెప్పారు.
‘‘కార్పొరేట్ బాధ్యతకు, సమాజ సేవకు అదానీ గ్రూప్ గొప్ప ఉదాహరణగా ఎప్పుడూ నిలుస్తూనే ఉంది. గౌతమ్ అదానీలో ప్రత్యేకత ఆయన నిరాడంబరత. ఆయన తనను ఎవరో పిలవాలని వేచి ఉండరు. నిస్వార్థంగా సేవ చేయడానికి తానే ముందు వచ్చేస్తారు. ఈ మహాప్రసాద సేవలో పాల్గొనడానికి ఆయన ముందుకు వచ్చినందుకు ఆయనకు ఎంతో కృతజ్ఞులం. ఆయన కృషి చూస్తే మనకు కూడా సమాజానికి తిరిగి ఇవ్వాలని, మానవాళికి సేవ చేయడంలో ఐకమత్యంగా ఉండాలనీ ప్రేరణ కలుగుతుంది’’ అని గురుప్రసాద స్వామి అన్నారు.
మహాకుంభమేళా సందర్భంగా కనీసం 50లక్షల మంది భక్తులకు మహాప్రసాద సేవ అందించాలని ఇస్కాన్, అదానీ గ్రూప్ భావిస్తున్నాయి. దానికోసం మేళా ప్రదేశానికి చేరువలో రెండు వంటిళ్ళను సిద్ధం చేస్తారు. మహాకుంభమేళా జరిగే చోట 40 ప్రదేశాల్లో ఆహారం పంపిణీ చేస్తారు. 2500 మంది స్వచ్ఛంద సేవకులు ఆ సేవలో పాల్గొంటారు.