బాలికపై అత్యాచారం జరిగిందంటూ అసత్య ప్రచారం చేసిన ఫోక్సో కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి చుక్కెదురైంది. కేసు కొట్టివేయాలంటూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రెండు నెలల కిందట చిత్తూరు జిల్లాలో ఓ బాలికపై అత్యాచారం జరిగిందంటూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వారి వివరాలు మీడియాలో ప్రచారం చేశారు. వారికి అండగా ఉంటామంటూ బాలిక చదువుతోన్న బడి వద్ద మీడియాతో మాట్లాడారు. బాలికపై అత్యాచారం జరగలేదని పోలీసులు చెబుతున్నా వినకుండా వివరాలు మీడియాకు వెల్లడించి ఫోక్సో చట్టాన్ని ఉల్లంఘించారని కేసు నమోదైంది.
బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు అత్యాచారం జరగలేదని నిర్ధారించారు. బాలిక తండ్రి కూడా బాలికపై అత్యాచారం జరగలేదని కొందరు కిడ్నాప్ చేసి వదిలేశారని పోలీసులకు వివరించారు. ఇవన్నీ పట్టించుకోకుండా బాలికపై అత్యాచారం జరిగిందంటూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. బాలిక, ఆమె తల్లిదండ్రుల వివరాలు తెలిసేలా మీడియా సమావేశాలు నిర్వహించి ఫోక్సో చట్టాన్ని ఉల్లంఘించారు. దీంతో చెవిరెడ్డిపై ఫోక్సో కేసు నమోదైంది.
అక్రమంగా తనపై కేసు పెట్టారని, కొట్టివేయాలంటూ చెవిరెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. ఫోక్సో చట్టాన్ని ఉల్లంఘించినట్లు భావించి కేసును క్వాష్ చేసేందుకు అంగీకరించలేదు. చెవిరెడ్డి తరపు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.