వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు, క్షేత్రాలు, పీఠాలు భక్తులతో నిండిపోయాయి.
ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. అయితే సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజును ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయని విశ్వాసం. ఆలయాలలో నేడు స్వామివారిని ఉత్తర ద్వారం దగ్గర భక్తులు దర్శించుకోవడం ద్వారా పాపాలు నశించి పరమపదించిన తర్వాత వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో పేర్కొనబడింది. పరమపవిత్రమైన రోజు కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల,వైకుంఠనాథుడు లక్ష్మీనరసింహుడిగా అనుగ్రహిస్తున్న యాదగిరి గుట్ట, భద్రాద్రి రామయ్య, శ్రీశైల మల్లన్న దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆయా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
నిరంతరం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుమల కొండలు నేడు మరింతగా శోభను సంతరించుకున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గవర్నర్లు, ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, క్రీడాకారులు, నటులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారికి కూడా ఉత్తర ద్వార దర్శనం కల్పించారు.
యాదగిరిగుట్టలో ఉదయం 5:15 నిమిషాలకు గరుడ వాహనంపై యాదగిరీశుడు ఉత్తరద్వార దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించారు. నేటి నుంచి ఈ నెల 15 వరకు యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. లక్ష్మీ నరసింహుడు నేటి నుంచి ఆరు రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రి రాములవారు ఉత్తర ద్వారంలో శ్రీ మహా విష్ణువు రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. జైశ్రీరామ్ నామస్మరణతో భద్రాద్రి మార్మోగుతోంది.
శ్రీశైలంలోనూ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరహర మహాదేవ్ అంటూ భక్తులు భగవంతుడిని స్మరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ఆలయాలకు కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. అన్నవరం, సింహాచలం, కోరుకొండ లక్ష్మీనరసింహుడి ని దర్శించుకుని తరిస్తున్నారు.