లేఅవుట్లు, భవన నిర్మాణాల నిబంధనలు సరళతరం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017 నిబంధనలు సవరిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా నిబంధనలు సడలించారు. ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటోన్న ఇబ్బందులు తొలగించాలంటూ బిల్డర్లు చేసిన వినతిని ప్రభుత్వం సానుకూలంగా తీసుకుని తాజా జీవో విడుదల చేశారు.
లే అవుట్లలో 12 మీటర్ల అంతర్గత దారులకు బదులు ఇక నుంచి 9 మీటర్లు ఉంటే సరిపోతుంది. 500 చ.మీ కంటే ఎక్కువ స్థలాల్లో సెల్లార్ నిర్మాణాలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీఆర్ బాండ్ల జారీ ప్రక్రియలో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్లను తొలగించారు. జాతీయ రహదారుల వెంట స్థలాల డెవలప్మెంట్కు 12 మీటర్ల సర్వీస్ రోడ్డు నిబంధన తొలగించారు. బహుళ అంతస్తుల సెట్ బ్యాక్ నిబంధనలు కూడా సరళతరం చేశారు.
సంక్రాంతి కానుకగా మరికొన్ని నిబంధనలు సడలించబోతున్నారు. 100 మీటర్ల లోపు స్థలాల్లో భవనాల నిర్మాణాలకు ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐదు అంతస్తుల నిర్మాణాలకు కూడా అనుమతులు ఆన్ లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు కల్పించబోతున్నారు. రాబోయే రోజుల్లో నిర్మాణరంగం లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా నిబంధనలు సరళతరం చేయబోతున్నారు.