భారతీయ రైల్వే మరో ఘనత సాధించింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలు ఇంజన్ తయారు చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ప్రపంచంలో హైడ్రోజన్ రైలు ఇంజన్ తయారు చేసిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక దేశాలు 500 హార్స్ పవర్ ఉన్న ఇంజన్లు మాత్రమే రూపొందించగలిగాయి. భారత్ తాజాగా 1200 హార్స్ పవర్ కలిగిన ఇంజన్ రూపొందించినట్లు రైల్వే మంత్రి తెలిపారు. ఇంజన్ తయారీ సిద్దమైందని, వ్యవస్థలను అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని వైష్ణవ్ వెల్లడించారు.
హర్యానాలోని జింద్ సోనీపత్ మార్గంలో హైడ్రోజన్ రైలును ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రవాస భారతీయ దివస్ సందర్భంగా హరిత అనుసంధానత సుస్థిరాభివృద్ధి ప్రవాసుల చేయూత అనే అంశంపై భువనేశ్వర్‌లో జరిగిన సదస్సులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రసంగించారు. రాబోయే రోజుల్లో ట్రక్కులు, టగ్ బూట్లకు కూడా హైడ్రోజన్ ఉపయోగించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.