తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలోని కల్వరి చర్చ్ కూల్చివేతకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీచేసింది. తగిన అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణాలకు సంబంధించిన లీగల్ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా కూల్చివేత జరుగుతుంది.
కల్వరి చర్చ్‌కు వ్యతిరేకంగా గుంటూరు వసంతరాయపురంలో నివసించే ఒక వ్యక్తి 2024 నవంబర్‌లో ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసారు. అందులో ఆయన ప్రధానంగా ఐదు ఆరోపణలను ప్రస్తావించారు. చర్చి అక్రమ కార్యకలాపాలు, పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీసు, కాలుష్య నియంత్రణ విభాగాల నుంచి అనుమతులు లేకపోవడం వంటి విషయాలను ఆ ఫిర్యాదులో చెప్పుకొచ్చారు.
హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ సతీష్ కుమార్ నిర్వహిస్తున్న ఆ చర్చ్‌లో భారీ మొత్తాల్లో నగదు వసూలు చేస్తున్నారనీ, వాటికి సంబంధించి ఎలాంటి పన్నులూ కట్టడం లేదనీ కూడా ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. పేద హిందువులకు కొన్ని నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తూ తప్పుడు బోధనలు చేస్తూ వారిని మతం మారుస్తున్నారని కూడా ఆ ఫిర్యాదులో ఆరోపించారు.
ప్రధానమంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేరడంతో ఆ విషయం గురించి దర్యాప్తు సమగ్రంగా జరిగింది. దాంతో కూల్చివేత ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమ కట్టడాన్ని కూల్చివేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
పాస్టర్ పి సతీష్ కుమార్ హైదరాబాద్‌లోని కల్వరి చర్చ్ వ్యవస్థాపకుడు. అతను ఆసియాలోని పెద్ద చర్చిలలో ఒక దాన్ని నిర్వహిస్తున్నాడు. కల్వరి చర్చ్‌లో 4లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. ప్రతీ వారం చర్చ్ సర్వీస్‌కు 20వేల మందికి పైగా హాజరవుతుంటారు. ఆ సంస్థ కల్వరి బైబిల్ కాలేజ్, కల్వరి హాస్పిటల్, కల్వరి స్కూల్స్ కూడా నిర్వహిస్తోంది.
పాస్టర్ సతీష్ తెలుగు రాష్ట్రాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తి. జాతీయ, అంతర్జాతీయ క్రైస్తవ సంస్థల్లో గుర్తింపు ఉంది. అతను తరచుగా దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటిస్తుంటాడు. తన సువార్త కార్యకలాపాల కోసం అమెరికాలోని చర్చిలకు కూడా తరచుగా వెడుతుంటాడు. 2018లో సతీష్ అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో భేటీ అయ్యాడు. ‘భారతదేశంలో మత స్వాతంత్ర్యాన్ని రక్షించాల్సిన ఆవశ్యకత’ గురించి సతీష్‌తో పాటు మరికొందరు విశ్వాసులైన క్రైస్తవ మతనాయకులతో చర్చించినట్లు పెన్స్ చెప్పాడు.
కల్వరి చర్చ్ నిర్వాహకులకు భూముల సంబంధించిన చట్టాలను ఉల్లంఘించడం తరచుగా చేసే పనే. మోసపూరిత ఒప్పందాలతో భూములను ఆక్రమించుకోవడం, కొత్త చర్చిలు పెట్టడం వారి అలవాటు. 2024 అక్టోబర్‌లో కాకినాడలో కల్వరి చర్చ్ డిజిటల్ బ్రాంచ్‌ను జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు జప్తు చేసారు.