తిరుపతి దుర్ఘటనలో మొదటి ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ప్రతిపక్ష వైఎస్ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. సిఎం, టిటిడి చైర్మన్, అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరూ బాధ్యులేనని, వారందరిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేసారు. తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.
‘‘రాష్ట్ర చరిత్రలో తిరుపతిలో తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోయిన ఘటన గతంలో ఎప్పుడూ చూడలేదు. జనవరి 10 వైకుంఠ ఏకాదశి నాడు లక్షల మంది దర్శనానికి వస్తారని తెలిసినా టీటీడీలో ఎందుకు ప్రోటోకాల్స్ పాటించలేదు? ఈ ఘటనకు సీఎం మొదలు, టీటీడీ ఛైర్మన్, జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరూ బాధ్యులే. చంద్రబాబుకు కూడా 10న వైకుంఠ ఏకాదశి అని తెలుసు. అంతకు ముందే, ఈ నెల 6 నుంచి 8 మధ్యాహ్నం వరకు ఆయన కుప్పంలో ఉన్నారు. దాంతో జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు అందరూ అక్కడికే వెళ్ళారు. సీఎం సెక్యూరిటీ కోసం దాదాపు 2 వేల మంది పోలీసులు కుప్పంలోనే ఉన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల దర్శనానికి ఇన్ని లక్షల మంది వస్తారనీ, మరోవైపు చంద్రబాబు పర్యటన కుప్పంలో ఉందనీ తెలిసినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయలేదు.’’
‘‘తిరుపతి, బైరాగిపట్టెడ కౌంటర్ ఎదురుగా పార్కులో ఉదయం 9 నుంచి భక్తులను ఉంచారు. రాత్రి 8.30కి పార్కు గేట్లు తెరిచారు. పార్కులో ఏ సౌకర్యాలూ కల్పించలేదు. భక్తులు వచ్చిన వెంటనే వాళ్లను క్యూ లైన్లో నిల్చోబెట్టి, తగినంత పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ఉంటే ఈ ఘటన జరిగుండేది కాదు. కానీ పోలీసులు అందుబాటులో లేరు. భక్తులందరినీ గుంపుగా ఉంచి ఒకేసారి విడిచిపెట్టడంతో దుర్ఘటన జరిగింది.’’
‘‘ఒకే ఒక్క చోట తొక్కిసలాట జరిగిందంటూ చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారు. పోలీసుల ఎఫ్‌ఐఆర్ కాపీల ప్రకారమే.. విష్ణు నివాసం దగ్గర ఒకరు, బైరాగిపట్టెడ దగ్గర ఐదుగురు చనిపోయారు. ఆస్పత్రిలో చూస్తే.. అన్ని కౌంటర్లలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కనిపిస్తున్నారు. ఈ దుర్ఘటనకు టీటీడీ ఒక్కటే బాధ్యులు కాదు. ఎస్పీ, పోలీసు విభాగం, కలెక్టర్, రెవెన్యూ విభాగంతో పాటు చంద్రబాబు నాయుడు సహా అందరూ బాధ్యత వహించాలి.’’
‘‘ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. దాదాపు 60 మంది గాయపడ్డారు. తిరుపతిలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే మొదటిసారి. ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని చంద్రబాబును గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. గాయపడిన వారందరికీ ఉచిత వైద్యం అందించాలి, వారందరికీ రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలి. ఈ ఘటనకు ముఖ్యమంత్రి, హోంమంత్రి, దేవాదాయశాఖమంత్రి, టీటీడీ ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో, ఎస్పీ, కలెక్టరు బాధ్యత వహించాలి.’’
‘‘తొక్కిసలాట ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో దొమ్మీ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన జరిగిన ఈ సంఘటనపై సెక్షన్–105 నమోదు చేయాల్సింది పోయి.. సంఘటనను చిన్నదిగా చూపేందుకు, కేసును నీరు గార్చేందుకే ప్రభుత్వం దారుణంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. వెంటనే ఎఫ్‌ఐఆర్ మార్చాలి.’’
‘‘చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయాక తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో అబద్దాన్ని సృష్టించి లడ్డూ ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేసిన చంద్రబాబు తాజా తప్పిదాల వల్ల టీటీడీ చరిత్రలో ఈరోజు బ్లాక్ మార్క్‌గా నిలిచిపోయింది. క్రౌడ్ మేనేజ్‌మెంట్ విషయంలో టీటీడీకి గొప్ప ఖ్యాతి ఉండేది. ఇప్పుడు చంద్రబాబు పాలనలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.’’
‘‘చంద్రబాబునాయుడికి శాస్త్రం తెలియదు, మిగిలిన గుడుల్లో ఎలా చేస్తున్నారన్న ఆచరణ కూడా తెలియదు. దేవుడి మీద భయభక్తులు కూడా లేవు. అవే ఉంటే తిరుమల ప్రసాదం గురించి అబద్దాలు చెప్పగలుగుతాడా? చంద్రబాబే ఈ దుర్ఘటనలో మొదటి ముద్దాయి. ఆయనకు ఈ పాపం కచ్చితంగా తగులుతుంది. తప్పు చేసాక దేవుడికి, భక్తులకి కనీసం క్షమాపణ చెప్పే చిత్తశుద్ధి, ఇంగిత జ్ఞానం లేదు. తన చేసిన తప్పులను వేరొకరి మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో పుష్కరాల్లోనూ ఇదే పని చేశాడు. షూటింగ్ కోసం అందరినీ ఒకేచోట పెట్టి.. గేట్లు ఒకేసారి ఎత్తారు. తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. ఆయన షూటింగ్ కోసం ఆయన దగ్గర, ఆయన సమక్షంలోనే ఆ ఘటన జరిగింది.’’
‘‘నేను తిరుపతి వస్తున్నానని తెలిసి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లను కూడా తరలించారు. తమ పరిస్ధితి బాగాలేదంటూ కొందరు పేషెంట్లు ఆసుపత్రిలో ఉండిపోయారు. నన్ను రాకుండా చేసేందుకు కుట్ర పన్నారు. మధ్యలో ఆపాలని చూశారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబుతో కుమ్మక్కైన అధికారులందరీకి దేవుడి మెట్టికాయలు కచ్చితంగా పడతాయి’’ అని జగన్ చెప్పుకొచ్చారు.