తిరుపతి దుర్ఘటనలో మరణించిన ఆరుగురి కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఆర్థిక సహాయం తక్షణమే అందిస్తామని, వారి కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు ఉద్యోగాలు ఇస్తామన్నారు. తీవ్ర గాయాలైన ఇద్దరికి 5 లక్షలు చొప్పున, సాధారణ గాయాలైన 33మందికి 2 లక్షలు చొప్పున సాయమందిస్తామన్నారు. ఆ 35 మందికీ శుక్రవారం ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని తెలిపారు. డీఎస్పీ రమణ కుమార్ బాధ్యత లేకుండా పనిచేశారని, గోశాల డైరెక్టర్ హరనాథ్‌రెడ్డి కూడా జవాబుదారీతనంతో పనిచేయలేదని వెల్లడైందని.. వీరిని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్‌వో శ్రీధర్‌ను తక్షణమే బదిలీ చేస్తున్నామని తెలిపారు. ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేస్తున్నామని, వాస్తవాలను అధ్యయనం చేసి, ప్రభుత్వానికి రిపోర్టు ఇస్తారన్నారు.
తిరుపతిలో ఈ మధ్యాహ్నం పర్యటించిన సీఎం, సీఎం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు, ఆసుపత్రికి వెళ్ళి బాధితులతో మాట్లాడారు, తర్వాత దుర్ఘటనపై సమీక్ష చేసారు. తర్వాత టీటీడీ పరిపాలనా భవనంలో మీడియాతో మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడూ ఎలాంటి అపశ్రుతీ జరక్కుండా బాధ్యత తీసుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలపై బోర్డులో చర్చించి, అమలుచేయాలి. తిరుమలలో రాజకీయాలు చేయడానికి వీల్లేదు… అని సీఎం చంద్రబాబు అన్నారు. భక్తులతో మాట్లాడిన విషయాన్ని చెప్పిన ముఖ్యమంత్రి… కొండపై ఉన్నప్పుడు ఎంతసేపైనా క్యూలెన్లలో ఉంటాం. కానీ, తిరుపతిలో టోకెన్లు ఇవ్వడం మాకు సరైందని అనిపించడం లేదని భక్తులు చెప్పినట్లు వివరించారు. వైకుంఠ ఏకాదశి.. ద్వాదశి.. రెండు రోజులు పవిత్రమైన రోజులు. అయితే వైకుంఠద్వార దర్శనాలను పదిరోజులకు పెంచారని, అలా ఎందుకు చేశారో తెలీదని, ఆగమ శాస్త్రాలు అనుమతిస్తాయో లేదో తెలీదని ముఖ్యమంత్రి అన్నారు. ఆలయాల్లో సంస్కరణల అమలుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమన్నారు.
ఈ పాత్రికేయ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మంత్రి వంగలపూడి అనిత, దేవదాయ ధర్మదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు, టిటిడి ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, టీటీడీ బోర్డు సభ్యులు, తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.