ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం కంటె ముందే దక్షిణ భారతంలో బ్రిటిష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్ర్య పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఈ నెల 11 న రాష్ట్ర స్థాయిలో అధికారికంగా జరుపుతున్నట్లు రాష్ట్ర బీసీ-ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత, టెక్స్టైల్స్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విశ్వకర్మ, వాల్మీకి, కనకదాస జయంతుల వరుసలోనే మరో బీసీ ముద్దు బిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఈ నెల 11 న గుంటూరు ఏ1 కన్వెన్షన్ హాల్లోను, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తామన్నారు.
ఓబన్న కర్నూల్ జిల్లా రేనాటి ప్రాంతంలో 1807 జనవరి 11 న సంచార జాతికి చెందిన వడ్డెర కులంలో జన్మించారు. శిస్తుల వసూలు విషయంలో ఈస్టిండియా కంపెనీ అధికారులకు, రేనాటి పాలెగాళ్ళకు మధ్య మొదలైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయి. వాటిలో నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం ముఖ్యమైనది. ఆ పోరులో సైన్యాధ్యక్షుడు వడ్డే ఓబన్న వీరోచిత పాత్రను పోషింరు. 10 వేల మందితో వడ్డెరలు, బోయలు, చెంచులతో సంచార తెగల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటిష్ సైన్యంతో వీరోచితంగా పోరాడారు. బ్రిటిష్ దౌర్జన్యాలపై వడ్డే ఓబన్న చేసిన పోరాటం విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేసే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి సవిత చెప్పారు.
బీసీల సంక్షేమానికి, అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని సవిత చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బీసీలకు బడ్జెట్లో రూ.39,007 కోట్లు కేటాయించామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు 60 వేల మందికి లబ్ది చేకూర్చేలా EWS కార్పొరేషన్లకు రూ.10,273.80 కోట్లు కేటాయించామన్నారు. బీసీ హాస్టళ్ళ విద్యార్థుల డైట్ బిల్లుల కోసం బడ్జెట్ కేటాయింపులకు అదనంగా రూ.45.52 కోట్లు ఇస్తున్నామన్నారు. కాస్మొటిక్ ఛార్జీల కోసం రూ.11 కోట్లు కేటాయించగా, అదనంగా మరో రూ. 21.60 కోట్లు మంజూరు చేసామన్నారు. ట్యూటర్ల పారితోషకానికి రూ.కోటి కేటాయించగా, ఇప్పుడు రూ.3.20 కోట్లు అదనంగా చెల్లిస్తున్నామన్నారు. 80% పనులు పూర్తయిన 5 బీసీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణానికి రూ.85 కోట్లు కేటాయించామన్నారు. అమరావతిలో 5 ఎకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మించబోతున్నామని, బీసీ అభ్యర్థుల కోసం ఇటీవల విజయవాడలో ఉచిత సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ ప్రారంభించామనీ చెప్పారు. 26 జిల్లాల్లో 6 వేల మందికి ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇస్తున్నామన్నారు. త్వరలో ఆన్ లైన్ శిక్షణా తరగతులు కూడా ప్రారంభిస్తామన్నారు. ఏపీ బ్రాహ్మణ ఋణ సహకార సొసైటీలాగే ఇతర ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లకు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు ఏర్పాటు చేసి వ్యక్తిగత, గ్రూపు రుణాలు అందిస్తామన్నారు. దానిలో భాగంగా ఏపీ ఆర్యవైశ్య, రెడ్డి, కమ్మ సహకార సొసైటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు.