తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల విక్రయ కేంద్రాల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. అధికారుల పనితీరును తప్పుపట్టారు. తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. టికెట్ల కోసం వేలాది మంది వస్తున్నారని తెలిసినా సరైన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని జేఈవో గౌతమిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, తిరుమల తిరుపతి ఈవో శ్యామలరావుపై కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా నెరవేర్చాలని ఆదేశించారు.
దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని మంత్రుల బృందం పరిశీలించింది. హోం మంత్రి అనిత, దేవాదాయశాఖ మంత్రి రామనారాయణరెడ్డి, రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్, నీటిపారుదల మంత్రి నిమ్మల రామానాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్విమ్స్‌లో చికిత్స పొందుతోన్న బాధితులను పరామర్శించారు.
తొక్కిసలాటలో చనిపోయిన వారి మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చి, అంత్యక్రియలు పూర్తి చేసే వరకు బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. జరిగిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.