భారతదేశం 2047 నాటికి వికసిత భారత్‌గా ఎదగడంలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ ప్రారంభోత్సవంలో ఆయన ఎన్ఆర్ఐలను ప్రశంసల్లో ముంచెత్తారు. ప్రపంచం అభివృద్ధికీ, భారత్ ఎదుగుదలకూ ఇండియన్ డయాస్పోరా విశేష కృషి చేస్తోందన్నారు. ప్రవాస భారతీయులు ప్రపంచానికి భారతదేశపు రాయబారులు అని కొనియాడారు. తమ ఘనమైన విజయాలతో భారత్‌కు గర్వకారణంగా నిలిచారన్నారు. ప్రపంచమంతటా భారతీయ విలువలకు గౌరవం పెరగడానికి కారణం వారేనన్నారు. గత పదేళ్ళలో ప్రపంచదేశాల నాయకులు ఎందరినో కలిసాను, వారందరూ ప్రవాస భారతీయులను ప్రశంసించారని మోదీ చెప్పారు. ప్రపంచ దేశాల్లో భారతీయ సామాజిక విలువలను ప్రచారం చేయడం ద్వారా ఎన్ఆర్ఐలు అందరి మన్ననలూ అందుకున్నారని అభినందించారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి మాతృస్థానంలో ఉండడం మాత్రమే కాదు, మన జీవన విధానంలోనే ప్రజాస్వామ్యం ఉందని గుర్తు చేసారు.
గత దశాబ్ద కాలంలో భారతదేశంలో 25కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బైటపడ్డారని మోదీ ప్రస్తావించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందన్నారు. పునర్వినియోగ ఇంధనరంగం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ, మెట్రో-బులెట్ రైళ్ళు సహా అన్ని రంగాల్లోనూ భారత్ అభివృద్ధి సాధిస్తోందన్నారు. కొన్నాళ్ళలో ఎన్ఆర్ఐలు ‘మేడిన్ ఇండియా’ విమానాల్లో స్వదేశానికి వస్తారన్నారు.
మోదీ భారత యువతరం గురించి కూడా ప్రస్తావించారు. ఈ దేశపు యువత తమ సామర్థ్యాలను వెలికితీయడం కోసం ప్రభుత్వం వారి నైపుణ్యాలకు మెరుగులు దిద్దడంపైనే దృష్టి కేంద్రీకరించిందన్నారు.
1915 జనవరి 9న, సుదీర్ఘకాలం తర్వాత గాంధీ విదేశాల నుంచి భారతదేశానికి వచ్చారంటూ ఇవాళ్టి విశిష్టతను మోదీ తలచుకున్నారు. మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా మొదలవబోతోందని గుర్తు చేసారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి పండుగ శోభ వెల్లివిరుస్తుందన్నారు. ఆ శోభ ప్రపంచంలో భారతీయులు ఉన్న ప్రతీచోటా కనిపిస్తుందన్నారు. భారతదేశానికి, ప్రవాస భారతీయులకూ మధ్య బంధాలను బలపరచడం కోసం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ ప్రవాసీ భారతీయ దివస్‌ను ప్రారంభించారని గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా మోదీ, ‘ప్రవాసీ తీర్థదర్శన్ యోజన’ పథకం కింద ఎన్ఆర్ఐల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పర్యాటక రైలుకు వర్చువల్‌గా జెండా ఊపి దాని మొదటి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరే ఆ రైలు దేశంలోని వివిధ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాల్లో మూడు వారాల పాటు తిరుగుతుంది. అలాగే ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా పలు ఎగ్జిబిషన్లు, వివిధ మంత్రిత్వ శాఖల స్టాళ్ళను కూడా మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ఎస్ జయశంకర్, జుయెల్ ఓరమ్, ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి చరణ్ మాఝీ తదితరులు పాల్గొన్నారు. రేపటి ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవుతారు.