గత ఏడాది కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో కెనడా పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు విచారణ జరుగుతోంది. ఇవాళ దిగువ కోర్టు నలుగురు నిందితులు కరణ్ బ్రార్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ ప్రీత్ షింగ్, అమర్దీప్ సింగ్‌లకు బెయిల్ ఇచ్చింది.దిగువ కోర్టు కేసును బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టుకు బదిలీ చేసింది. ఫిబ్రవరి 11 తరవాత విచారణ ప్రారంభం కానుంది.
నిజ్జర్ 2023 జూన్‌లో కెనడాలోని సర్రే ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. నిజ్జర్ హత్యలో భారత ప్రమేయముందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడాలోని భారత హైకమిషనర్‌ను కూడా కేసులో నిందితుడిగా చేర్చడంతో రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరింది. కెనడాలోని భారత్ దౌత్య కార్యాలయ కమిషనర్‌ను భారత్ వెనక్కు పిలిపించింది. ఢిల్లీలోని కెనడా రాయబారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
కెనడాలో ఉంటూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడని నిజ్జర్‌పై ఆరేళ్ల కిందట భారత్ నిషేధం విధించింది. నిజ్జర్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అప్పటి నుంచి నిజ్జర్ కెనడా, అమెరికాల్లో ఉంటూ ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నాడని భారత్ ఆరోపిస్తోంది.