శ్రీశైల క్షేత్రంలో ఆదిదంపతులకు వైకుంఠ ఏకాదశి రోజున పుష్పార్చన నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఈ నెల 10న పుష్యశుద్ధ ఏకాదశి రోజున భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలకు విశేష పుష్పార్చన జరిపించనున్నారు.
గులాబీ, చేమంతి, నూరువరహాలు, కాగడా మల్లెలు, సన్నజాజులు, విరజాజులు, గన్నేరు, కనకాంబరం, సంపంగి, తామర పుష్పాలతో పాటు బిల్వం, దవనం, మరువం, మొదలైన పత్రాలతో ఆదిదంపతులకు పూజాదికాలు నిర్వహించనున్నారు. ఈ అర్చనలో సుమారు నాలుగువేల కిలోల పువ్వులు వినియోగించనున్నారు. 40 రకాల పుష్పాలను ఎంపిక చేసి వాటితో పూజ చేయనున్నారు. కైంకర్యానికి అవసరమైన పుష్పాలన్నింటిని పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ విరాళంగా అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనవరి 10న భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలకు ప్రత్యేక ఉత్సవం నిర్వహించనున్నారు. వేకువ జామున ఉత్తరద్వార దర్శనం, రావణవాహనసేవ నిర్వహించనున్నారు.