వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లు ఇచ్చే కేంద్రం దగ్గర బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలను మంత్రుల బృందం పరామర్శించింది. వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర మంత్రులు ప్రకటించారు.
ఇవాళ ఉదయం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ మంత్రి – జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ-సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని… జాయింట్ కలెక్టర్‌తో కలసి రుయా ఆసుపత్రి మార్చురీలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఓదార్చివివరాలు తెలుసుకున్నారు.
తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడుతూ… తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతీచోటా సిసి కెమెరాలు ఉన్నాయని, వాటిని పరిశీలించి ఈ సంఘటనపై పూర్తి విచారణ చేస్తామనీ చెప్పారు. ఆ విచారణలో సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టమైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు పరిహారం అందజేస్తుందని చెప్పారు.
తిరుపతి దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను తిరుపతికి పంపారని మంత్రుల బృందం ప్రకటించింది. ఇది దురదృష్టకర సంఘటన అని, ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామనీ తెలిపారు. మృతులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారని, వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా వారి స్వగ్రామాలకు చేరుస్తామన్నారు.