బలోచిస్తాన్‌లోని కెచ్ జిల్లా నుంచి పాకిస్తాన్ భద్రతా బలగాలు నలుగురు వ్యక్తులను ఎత్తుకుపోయాయి. పాక్ బలగాలు సోమవారం బలవంతంగా తీసుకుపోయిన ఆ వ్యక్తులు ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియరాలేదు. పాక్ భద్రతా బలగాలు ఎత్తుకుపోయిన వారు రంజాన్ బలోచ్, షగరుల్లా, షేర్ జాన్ ఇషాక్, ఫరూక్ ఇషాక్ అని తెలుస్తోంది.
రంజాన్ బలోచ్‌ను మాండ్ ప్రాంతం నుంచి సోమవారం రాత్రి 7 గంటల వేళ తీసుకుపోయారు. అప్పటినుంచీ కుటుంబసభ్యులు, అతని ఉద్యోగ సహచరులు, హిరోంక్‌లో జాతీయ రహదారిని చుట్టుముట్టి నిరసన ప్రదర్శన చేపట్టారు. రంజాన్‌ను తక్షణం విడిచిపెట్టాలని డిమాండ్ చేసారు.
షేర్ జాన్ ఇషాక్, ఫరూక్ ఇషాక్‌లను సోమవారం రాత్రి తుర్బాత్‌లోని ఆప్సర్ బాండే బజార్ ప్రాంతంలోని వారి ఇంటి నుంచి ఎత్తుకుపోయారు. షగరుల్లాను మంగళవారం సాయంత్రం షాహీ టంప్ ప్రాంతం నుంచి ఎత్తుకుపోయారు. పాక్ పోలీసులు తమ ఇంటిమీద దాడి చేసి పిల్లలను ఎత్తుకుపోయారని ఇషాక్‌ల తల్లిదండ్రులు వాపోయారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మూడేళ్ళ క్రితం అదే కుటుంబంలోని మరో అబ్బాయి షామ్స్ ఇషాక్ ఇలాగే మాయమైపోయాడు, ఇప్పటికీ ఆ పిల్లవాడు దొరకలేదు.
బలోచిస్తాన్‌లో కొన్నేళ్ళుగా ఇలాంటి అదృశ్యం కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు అలాంటి సంఘటనలు దాదాపు ప్రతీరోజూ జరుగుతుండడం స్థానికులను కలవరపరుస్తోంది. బాధిత కుటుంబాలు రహదారుల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నాయి. తద్వారా జరుగుతున్న అదృశ్యం ఘటనల గురించి, బలోచిస్తాన్‌లో పాకిస్తాన్ పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల గురించి స్థానికుల్లో అవగాహన పెంచుతున్నాయి.