నిషిద్ధ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు నిధులు సమకూర్చిన పలువురు ప్రవాస కేరళీయులను ఎన్ఐఏ గుర్తించింది. గల్ఫ్ దేశాల్లో నివాసముంటూ పిఎఫ్ఐకు ఆర్థికంగా బలం సమకూరుస్తున్న ఆ వ్యక్తుల ఖాతాలను ఎన్ఐఎ, ఈడీ సంయుక్తంగా గుర్తించాయి. ఆ ఖాతాదారులపై చర్యలకు ఉపక్రమించాయి.
పీఎఫ్ఐకు గల్ఫ్ దేశాల నుంచి సుమారు 13వేల ఖాతాల నుంచి డబ్బులు అందుతున్నట్లు ఎన్ఐఏ, ఈడీ కనుగొన్నాయి. వాటిలో 10వేల ఖాతాలు కేరళవాసులవే. తమ ఖాతాల వివరాలు నిఘా సంస్థలు తీసుకున్నాయని వారికి తెలిసింది. భారత్ వస్తే పట్టుబడిపోతామేమో అని భయపడుతున్నారు. వారు ఇకపై సెలవులకు స్వదేశానికి రాకపోవచ్చు. వివిధ గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆ 13వేల మంది వ్యక్తులు హవాలా కార్యకలాపాల్లో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఎన్ఐఏ, ఈడీ ఆ వ్యక్తుల జాబితాను బహిర్గతం చేయనందున తాము ఆ నేరస్తుల్లో ఉన్నామో లేదో అన్న భయం ఆ 13వేల మందినీ వణికిస్తోంది. హత్రాస్ కేసులో నిందితుడు సిద్దిక్ కప్పన్, రౌఫ్ షరీఫ్ బ్యాంకు ఖాతాలకు నిధులు సమకూర్చిన వారు, వారి కుటుంబసభ్యులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు.
బిహార్‌కు చెందిన ఒక పిఎఫ్ఐ ఉగ్రవాది మహమ్మద్ అలాత్ ఈ కేసులో 18వ నిందితుడు. అతను ఆయుధాలు ఉపయోగించడంలో శిక్షణ పొందాడు. అలాత్ ఖాతాలోకి భారీ మొత్తాల్లో నగదు జమ అయినట్లు దర్యాప్తులో తేలింది. అతని మీద ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం లుకౌట్ నోటీసు జారీ చేసింది. అతను దుబాయ్ నుంచి వచ్చినప్పుడు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్ఐఎ అరెస్ట్ చేసింది.