తిరుపతి తొక్కిసలాటపై జిల్లా కలెక్టర్ ప్రాధమిక నివేదికను సీఎం చంద్రబాబునాయుడుకు అందించారు. బైరాగిపట్టెడ కౌంటర్ వద్ద డీఎస్పీ, అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుకుందని కలెక్టర్ నివేదికలో వెల్లడించారు. టికెట్ల కోసం క్యూలైనులో ఉన్న ఓ భక్తుడు తూలిపడిపోయాడు. అతన్ని అంబులెన్సులో తరలించేందుకు ప్రయత్నించారు. అంబులెన్సు తీసుకువచ్చిన డ్రైవర్ వాహనం అక్కడ వదిలేసి 20 నిమిషాల వరకు కనిపించకుండా పోయాడని నివేదిక ద్వారా తెలుస్తోంది.
భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తూలిపడిపోయిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు డీఎస్పీ గేటు తీసినట్లు తెలిపారు. విషయం తెలియక భక్తులు టికెట్ల కోసం గేట్లు తెరుస్తున్నారని ఎగబడ్డారని దీంతో తొక్కిసలాట జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. తొక్కిసలాట తరవాత కూడా డీఎస్పీ సరిగా స్పందించలేదని కలెక్టర్ నివేదిక ద్వారా వెల్లడించారు.
తొక్కిసలాట విషయం తెలియగానే జిల్లా ఎస్పీ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిత్తూరు ఎస్పీ సుబ్బారాయుడు తన సిబ్బందితో వచ్చి తొక్కిసలాట వద్ద పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు కలెక్టర్ నివేదిక సమర్పించారు. డీఎస్పీ, అంబులెన్సు డ్రైవరు నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోయినట్లు ప్రాధమిక నివేదిక ద్వారా తెలుస్తోంది. టికెట్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున వస్తారని తెలిసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు నివేదిక స్పష్టం చేసింది.