తిరుపతిలో ఘోరం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విక్రయ కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగింది. తిరుపతిలోని పద్మావతి పార్కు బైరాగిపట్టెడ , జీవకోన, శ్రీనివాసం, అలిపిరి వద్ద ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. 42 మందికిపైగా గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
ఈనెల 10,11,12 తేదీలకు లక్షా 20 వేల టికెట్లను తిరుపతిలోని 8 కేంద్రాలు విక్రయానికి ఉంచారు. బైరాగిపట్టెడ కేంద్రం వద్ద భక్తులు టికెట్ల కోసం పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ సమయంలో ఓ భక్తులు తూలిపడిపోవడంతో అతన్ని తరలించేందుకు పోలీసులు గేట్లు తీసే ప్రయత్నం చేయగా అందరూ ఒక్కసారిగా తోసుకుని తొక్కిసలాటకు దారితీసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. డీఎస్పీ గేటు తీయడంతో టికెట్ల కోసం గేటు తీశారని జనం ఒక్కసారిగా ఎగబడినట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రమాదం జరగ్గానే కలెక్టర్, ఎస్పీ, తిరుమల తిరుపతి ఈవో శ్యామలరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు పరామర్శించారు. గాయపడిన వారిలో 20 మందిని డిశ్చార్జ్ చేశారని, మరో 22 మంది చికిత్స పొందుతున్నట్లు డాక్లర్లు ప్రకటించారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. అధికారులతో ఫోన్లో సమీక్షించారు. కాసేపట్లో ఘటనా స్థలానికి సీఎం చంద్రబాబునాయుడు వెళ్లనున్నారు.