వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం కోసం టికెట్లు విక్రయించే కేంద్రాల దగ్గర తొక్కిసలాటల్లో ఆరుగురు చనిపోయిన ఘటనపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. విపక్ష వైసీపీ ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యమని మండిపడింది.
అధికార ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పక్షం జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి ఘటనపై ఆవేదన వ్యక్తం చేసారు. ‘‘భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాఖకు సూచిస్తున్నాను. మృతులు, క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల వారు ఉన్నారని తెలిసింది. వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం, సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు సూచిస్తున్నాను. మృతుల కుటుంబాలను పరామర్శించి మనోధైర్యం ఇచ్చే బాధ్యతలు టీటీడీ పాలక మండలి తీసుకోవాలి. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతిలో టికెట్ కౌంటర్ల దగ్గర క్యూలైన్ల నిర్వహణలో అధికారులకు, పోలీసు సిబ్బందికి జనసేన నాయకులు, జన సైనికులు తోడ్పాటు అందించాలి’’ అని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసారు.
ఎన్డీయే కూటమిలోని మరో భాగస్వామ్య పక్షం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసారు. తిరుమల తిరుపతి చరిత్ర లో ఇటువంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యతారహితంగా వ్యవహరించిన అందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం తన హృదయాన్ని కలచివేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. బాధితకుటుంబాలకు అన్ని విధాలా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తిరుపతి దుర్ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.
వైసీపీ నాయకుడు, మాజీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తిరుపతి దుర్ఘటన ముమ్మాటికీ రాష్ట్రప్రభుత్వం తప్పేనని మండిపడ్డారు. ‘‘ముక్కోటి ఏకాదశి ముందుగా అందరికీ తెలిసి వచ్చే కార్యక్రమం. అప్పటికప్పుడు వచ్చేది కాదు. దానికి లక్షలమంది వస్తారని ప్రభుత్వానికి తెలుసు. అయినా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించారు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధ్యులమీద చర్యలు తీసుకోవాలి. టీటీడీ ఛైర్మన్ తిరుమలను రాజకీయ కేంద్రంగా మార్చారు. భక్తులను పక్కకు వదిలేసి వీఐపీల సేవలో తరిస్తున్నారు. టీటీడీ ఈవోకూ అక్కడి కార్యక్రమాలమీద అవగాహన లేదు. వీళ్లంతా రాజకీయ అజెండాలో భాగంగానే తిరుమలకు వచ్చారు తప్ప, భక్తులకు సేవ చేయాలని కాదు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. తొక్కిసలాటలో భక్తుల మరణాలు ప్రభుత్వ హత్యలే. నాలుగు దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబునాయుడు కనీసం ముక్కోటి ఏకాదశి సందర్భాన కనీస ఏర్పాట్లు కూడా చేయలేకపోయారు. ఆయన పబ్లిసిటీ స్టంట్లు ఆపి, భక్తులకు మంచి సౌకర్యాలు అందిచడంపై దృష్టిపెట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేస్తున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అని చెప్పారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రివర్గ బృందం తిరుపతి చేరుకుంది. రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మంత్రి వంగలపూడి అనిత, దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ స్విమ్స్ ఆస్పత్రి లో క్షతగాత్రులను పరామర్శించారు.