వికసిత్ ఆంధ్రాకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు. విశాఖ ఆంధ్రా వర్సిటీలో నిర్వహించిన సభలో మాట్లాడిన ప్రధాని మోదీ, ప్రసంగం ప్రారంభంలో సింహాచల వరాహ నరసింహస్వామికి ప్రణామాలు అర్పించారు. ఏపీ ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపిన మోదీ, తాను మూడోసారి ప్రధానిగా ఎన్నికవడంలో ఆంధ్ర ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు మరువలేనని అన్నారు.
సీఎం చంద్రబాబు ప్రసంగంలోని ప్రతి మాట వెనుక ఉన్న భావం అర్థమైందన్న మోదీ, ఏపీకి సంబంధించి ప్రజలు, ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే విశ్వాసం చూపిస్తున్నారో, దానికి భంగం కలగకుండా రాష్ట్ర లక్ష్యాలన్నింటినీ సాకారం చేసేందుకు కృషి చేస్తానని మోదీ తెలిపారు.
ఏపీ అభివృద్ధితో దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. 2047 నాటికి ఏపీ 2.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యానికి అవసరమైన తోడ్పాటును కేంద్రం అందిస్తుందన్నారు. నేడు రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసినట్లు తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సరికొత్త శిఖరాలకు చేరుతుందని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ హైడ్రోజన్ కూడా, ఐటీ పరిశ్రమ వలే అభివృద్ధి చెందే ప్రాజెక్టే అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా అనేక ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు.
నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేయడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కృష్ణపట్నంలో క్రిస్ సిటీ ప్రాజెక్టుతో లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని ఆకాంక్షించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు పునాదిరాయి వేయడం ఏపీ అభివృద్ధిలో మైలురాయిగా ఉంటుందన్నారు.
అంతకు ముందు నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.