తమిళనాడు రాష్ట్ర పురావస్తు విభాగం నిర్వహించిన తులనాత్మక అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసాయి. తమిళనాడులో పురావస్తు తవ్వకాలలో లభించిన 60శాతం చిహ్నాలు, 90శాతం గ్రాఫిటీ మార్క్స్‌కు సింధులోయ నాగరికతలో లభించిన చిహ్నాలు, చిత్రాలతో విస్పష్టమైన సారూప్యం ఉన్నట్లు తేలింది. దాంతో ఆ రెండు ప్రాచీన సంస్కృతుల మధ్యా సంబంధాన్ని కనుగొనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
తమిళనాడులో కొన్ని దశఆబ్దాలుగా 140 ప్రదేశాల్లో నిర్వహించిన పురావస్తు తవ్వకాల్లో లభించిన 15వేలకు పైగా వస్తువులు, చిహ్నాలు, చిత్రాలను ఆ రాష్ట్ర పురావస్తు శాఖ డిజిటైజ్ చేసింది. ప్రొఫెసర్ కె రాజన్, ఆర్ శివానందన్ వాటిపై మార్ఫలాజికల్ స్టడీ చేసారు. ఆ అధ్యయనం 42 చిహ్నాలను మౌలికమైన చిహ్నాలుగా గుర్తించింది.544 చిహ్నాలను మౌలిక చిహ్నాల వేరియంట్స్గానూ, 1521 చిహ్నాలను సంయుక్త రూపాలుగానూ గుర్తించింది. తర్వాత వాటిని, సింధులోయ నాగరికతలో దొరికిన, ఇప్పటివరకూ అర్ధం చేసుకోలేకపోయిన చిహ్నాలతో పోల్చారు.
‘’42 మౌలిక చిహ్నాలు, వాటి వేరియంట్స్‌లో సుమారు 60శాతం గ్రాఫిటీ మార్క్స్ (కుడ్యచిత్రాల సంకేతాలు) సింధు లిపితో పోలికలు కలిగి ఉన్నాయి. అంతేకాదు, తమిళనాడులో లభించిన గ్రాఫిటీ మార్క్స్‌లో 90శాతం సింధులోయలోని వాటిని పోలి ఉన్నాయి. నిజానికి, తమిళనాడులో లభించిన చాలా చిహ్నాలకు సింధు లిపిలోని చిహ్నాలతో కచ్చితమైన పోలికలున్నాయి’’ అని ప్రొఫెసర్ రాజన్ చెప్పారు.
సింధులోయ నాగరికతను కనుగొని వందేళ్ళు గడిచిన ఈ శతాబ్ది సంవత్సరంలో విడుదల చేసిన ఈ తులనాత్మక అధ్యయనం ఫలితాలు – సింధులోయ నాగరికత చిహ్నాలు, తమిళనాడులో లభించిన గ్రాఫిటీ రెండింటిలోనూ పోలికలు ఉండడాన్ని గమనిస్తే – రెండింటి మధ్యా ఆదాన ప్రదానాలు ఉన్నాయని సూచిస్తున్నాయి అని రాజన్ వివరించారు.
కీలాడిలో లభించిన చిహ్నాలు 2600 ఏళ్ళ నాటివి, శివగళైలో లభించిన పురావస్తు చిహ్నాలు 3200 ఏళ్ళ నాటివి అని కార్బన్‌డేటింగ్ పరీక్షల ద్వారా తేలింది, బహుశః వాటికి సింధులోయ నాగరికతతో సంబంధం ఉండి ఉంటుంది అని తమిళనాడులోని పురావస్తు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. హరప్పా నాగరికతకు, తమిళ సెటిల్మెంట్లకూ మధ్య కాలిక దూరం (టెంపొరల్ గ్యాప్) తగ్గిపోతోందని వారు వాదిస్తున్నారు. అయితే రాష్ట్రానికి ఆవలి నిపుణులు ఆ సిద్ధాంతాన్ని ఇంకా పూర్తిగా విశ్వసించడం లేదు. చిత్రాలు గీసి ఉన్న కుండపెంకులు దేశంలో దొరికిన వాటిలో ఎక్కువ దక్షిణ భారతదేశంలో, అందునా తమిళనాడులోనే లభించాయని వారు గుర్తుచేస్తున్నారు.
తిరునల్వేలిలోని తూలుకర్పట్టి ఒక్కచోటే 5వేలకు పైగా గ్రాఫిటీ మార్క్స్ లభించాయి. కీలాడి, అరికమేడు, ఉరయ్యూర్, కోరకై, అళంగుళం, అదిచనల్లూరు, కొడుమనల్, కిల్నమండి వంటి ప్రదేశాల్లో కూడా గ్రాఫిటీ మార్క్స్ కనుగొన్నారు.
‘‘తమిళనాడులోని ఒక చిన్న భౌగోళిక ప్రదేశంలోనే మేము 15వేల గ్రాఫిటీ మార్క్స్‌ను కనుగొన్నాము. భారత ఉపఖండంలో మరే ఇతర ప్రదేశంలోనూ అన్ని పురావస్తు చిహ్నాలు దొరకలేదు. దాన్నిబట్టి తమిళనాడులో దొరికిన గ్రాఫిటీ మార్క్స్, సింధులోయ నాగరికతలోని లిపి సమకాలీనమైనవి అయి ఉండవచ్చునని ప్రతిపాదిస్తున్నాం’’ అని రాజన్ చెప్పారు.
తమిళనాడు రాష్ట్ర పురావస్తు విభాగం జాయింట్ డైరెక్టర్ శివానందన్ కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. సింధు నాగరికతకు, తమిళనాడులోని ఐరన్ ఏజ్ సెటిల్మెంట్లకూ మధ్య పోలికలు, అవి రెండూ కలిసి ఒకే కాలంలో ఉండి ఉండొచ్చునన్న పరికల్పనలకు – లిపి, వస్తు సంస్కృతి, వాణిజ్య-సాంస్కృతిక ఆదాన ప్రదానాల సాక్ష్యాలు బలం చేకూరుస్తున్నాయి. సింధు లిపి లేదా దాని చిహ్నాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదని, అవి వివిధ రూపాల్లోకి రూపాంతరం చెంది లేక ఎదిగి ఉండొచ్చని ఆ పరికల్పనలు సూచిస్తున్నాయి. ఈ తులనాత్మక అధ్యయనం భాషకు సంబంధించినది కాదు, ఆకృతికి సంబంధించిన పద్ధతి’’ అని శివానందన్, రాజన్ తమ పరిశోధనలో వివరించారు. ఈ తులనాత్మక అధ్యయనం, సింధులోయ నాగరికత, తమిళనాడులో ఇనప యుగపు సెటిల్మెంట్ల మధ్య ఆదాన ప్రదానాలు జరిగి ఉండే అవకాశాన్ని సూచిస్తున్నాయని రాజన్ వివరించారు.
‘‘గ్రాఫిటీ మార్క్స్‌తో పాటు మేము గురువింద పూసలు, గోమేధికాలు, నీలాలు, కెంపులు, మరికొన్ని కళాకృతులను ఈ తమిళనాడు సెటిల్మెంట్స్లో కనుగొన్నాం. రెండు సంస్కృతుల మధ్యా ఇచ్చిపుచ్చుకోడాలు ఉన్నాయన్న సిద్ధాంతానికి అవి మద్దతు పలుకుతున్నాయి. ఏదేమైనా, ఆ సంబంధాన్ని కచ్చితంగా ప్రకటించడానికి మరిన్ని ఆధారాలు అవసరం. మా ప్రస్తుత పరిశోధనల లక్ష్యం దాన్ని కనుగొనడమే’’ అని రాజన్ చెప్పారు.
ముద్రల మీద చెక్కిఉండే గుర్తులను చిహ్నాలు అంటారు. మట్టివస్తువుల మీద ఉండే వాటిని గ్రాఫిటీ మార్క్స్ అంటారు. రెండింటినీ ఒకే జనాలు రూపొందించారు అని పురావస్తు శాస్త్రవేత్తలు వివరించారు. వాటి తులనాత్మక అధ్యయనం ప్రకారం.. తమిళనాడులో దొరికిన గ్రాఫిటీ మార్క్స్, సింధులోయ నాగరికతలో దొరికిన చిహ్నాలు రెండింటినీ ఇంకా అర్ధం చేసుకోలేదు అని రాజన్, శివానందన్ వెల్లడించారు.
సింధులోయ నాగరికత గురించి కొంతకాలంగా జరుగుతూన్న చర్చకు ఈ అధ్యయనం ఓ కొత్త దృక్కోణాన్ని జోడించింది. సింధులోయ నాగరికతలోని భాష, లిపి, వాటి ప్రాధాన్యాన్ని మెరుగ్గా అర్ధం చేసుకోడానికి అవసరమైన ఉపకరణాలను అందించింది. ఇప్పటివరకూ ఆ చర్చ… వస్తు సంస్కృతి, సాహిత్య సంబంధిత భాషా అధ్యయనాలు, ప్రదేశాల పేర్ల తులనాత్మక అధ్యయనం, సింధులోయ నాగరికతకూ తమిళ భూమికీ ఉన్న భౌగోళిక సంబంధాలు… నాలుగు అంశాల చుట్టూనే తిరుగుతూ ఉండేది.
ఈ అధ్యయనం మరో పునర్మూల్యాంకనానికి దారి తీసిందని ఇండాలజీ నిపుణుడు ఆర్ బాలకృష్ణన్ చెప్పుకొచ్చారు. దక్షిణ భారతదేశంలో ఇనుము వాడకం పూర్వ సామాన్య శకం 3వ సహస్రాబ్దిలోనే ఉందని దీన్ని బట్టి తెలిసింది. దాన్ని బట్టి దక్షిణ భారతదేశపు ఇనుప యుగం, ఉత్తర భారతదేశపు రాగి యుగం ఒక కాలం నాటివని తెలుస్తోంది. ‘‘సింధులోయ నాగరికతలోని చిక్కుముళ్ళు, తమిళ పురావస్తువుల మార్మికతలు ఒకరకంగా ఒకే నాణేనికి ఉండే రెండు పక్షాల వంటివి. వాటి మధ్య భౌగోళిక, కాలిక దూరానికి దానితో సంబంధం లేదు’’ అని బాలకృష్ణన్ వివరించారు.