రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం
మార్చిలో దేశవ్యాప్తంగా ప్రారంభించనున్న కేంద్రం
కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందించేందుకు గాను కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పథకంలో భాగంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు నగదు రహిత వైద్యాన్ని పొందవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వచ్చే మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఈ పథకం అందుబాటులోకి వస్తుందన్నారు.
రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత 7 రోజుల వరకు రూ.1.5 లక్షల వరకు వైద్యాన్ని పొందే అవకాశం ఉందన్నారు. అన్ని రకాల రోడ్లపై మోటారు వాహనాల కారణంగా జరిగే ప్రమాదాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదం తర్వాత బాధితులకు అత్యంత కీలకమైన ‘గోల్డెన్ అవర్’ సమయంలో వైద్యం అందించడమే ఈ పథకం లక్ష్యమన్నారు.
నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) ఈ స్కీమ్‌ను అమలు చేస్తుందని తెలిపారు. పథకం అమలు కోసం పోలీసులు, హాస్పిటల్స్, ప్రభుత్వ వైద్య సంస్థల సహకారం తీసుకోనున్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, ఈ-డిటైల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ (ఈఏడీఆర్) అప్లికేషన్, ఎన్హెచ్ఏ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈ మూడింటితో అనుసంధానించిన ఐటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ పథకం కార్యకలాపాలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు.
ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు ను 2024 మార్చి 14న చండీగఢ్‌లో ప్రారంభించారు. ఆ తర్వాత ఆరు ఇతర రాష్ట్రాలకు విస్తరించిన విషయాన్ని గడ్కరీ గుర్తు చేశారు.