ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన కృతికా శుక్లా, ఇంటర్ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు స్వీకరిస్తామని తెలిపారు.
చాలా ఏళ్ళగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదన్న కృతికా శుక్లా జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. సైన్స్, ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామన్నారు.
2025-26 ఏడాదికి ఇంటర్ మొదటి ఏడాదిలో ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలు ప్రవేశపెడతామన్నారు. దీంతో నీట్, జేఈఈ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుందని వివరించారు.
పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలో సంస్కరణలు తెస్తామన్న కృతికా శుక్లా , ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు తొలగిస్తామన్నారు. కళాశాలలే అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తాయన్నారు. ఇంటర్ రెండో ఏడాది పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుందన్నారు.
ఈ నెల 26 లోగా సంస్కరణలపై సలహాలు, సూచనలు పంపాలని కోరారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ప్రతిపాదిత సంస్కరణల వివరాలు ఉంచామన్నారు.